
చిన్నారిని చిదిమేసిన నిర్లక్ష్యం
మామిడి కాయల కోసం ట్రాక్టర్ వెంట పరిగెడుతూ మృతి
జి.కొండూరు: కన్న తల్లిందండ్రుల అశ్రద్ధ, ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ చిన్నారి జీవితాన్ని చిదిమేసింది. అభం శుభం తెలియని వయసులో ఆశతో తీసిన పరుగు ఆ చిన్నారికి ఏడేళ్ల వయసులోనే నూరేళ్లు నిండిపోయేలా చేసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులు ఆ చిన్నారిపై ఓ కన్ను వేసి ఉంచినా, ట్రాక్టర్ డ్రైవర్ ఒక క్షణం ట్రాక్టర్ ఆపినా ఒక నిండు ప్రాణం దక్కేది. మామిడి కాయల కోసం ట్రాక్టర్ వెంట పరుగెత్తిన చిన్నారి, ట్రాక్టర్ తగిలి రోడ్డుపై పడి మృతి చెందిన ఘటన వెల్లటూరు గ్రామ శివారులో ఇటుక బట్టీల వద్ద బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఒడిశా రాష్ట్రం, నబరంగ్‌పూర్ జిల్లా, జారిగామ్ చెందిన మంచుగౌడ్ ఆయన భార్య నీలాంద్రిగౌడ్ తమ ఇద్దరి పిల్లలు శంకర్ గౌడ్, చిన్న కుమారుడు దేబరాజ్‌గౌడ్(7)తో కలిసి గత మూడేళ్లుగా ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండల పరిధి వెల్లటూరు శివారులో నిర్వహిస్తున్న ఇటుక బట్టీలో పని చేస్తున్నారు.
కాయలు విసరడంతో వెంటపడుతూ..
అయితే బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో వీరు పని చేస్తున్న ఇటుక బట్టీకి పక్కగా ఉన్న రహదారిపై మామిడి కాయల లోడుతో ట్రాక్టర్ వెళ్తుంది. ఈ క్రమంలో మామిడి కాయల కోసం ఇటుక బట్టీలో పని చేస్తున్న కుటుంబాలకు చెందిన మరి కొంత మంది పిల్లలతో కలిసి దేబరాజ్ గౌడ్ అనే చిన్నారి ట్రాక్టర్ వెంట పరిగెత్తడం ప్రారంభించాడు. ట్రాక్టర్‌లో ఉన్న కూలీలు కొన్ని మామిడి కాయలను కిందకు విసరడంతో ఆ మామిడి కాయలను తీసుకునే క్రమంలో ట్రాక్టర్ తగిలిన దేబరాజ్ గౌడ్ రోడ్డుపై పడిపోయాడు. తలకు బలమైన గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లిన దేబరాజ్‌గౌడ్‌ను ఇటుక బట్టీ యజమాని తన కారులో మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పొట్ట కూటి కోసం రాష్ట్రాలు దాటి వచ్చి పని చేసుకుంటున్న ఆ కుటుంబంలో చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు ఆవేదన వర్ణనాతీతంగా మారింది. చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం మైలవరంలోని ఆంత్యక్రియలు నిర్వహించారు. మృతుడు తండ్రి మంచుగౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సతీష్‌కుమార్ తెలిపారు.