
కృష్ణలంక హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
● ఒక దానికొకటి ఢీ కొన్న నాలుగు వాహనాలు ● ముగ్గురికి స్వల్ప గాయాలు
కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణలంక జాతీయ రహదారిపై సత్యంగారి హోటల్ జంక్షన్ వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు, ఒక వ్యాన్ ఒక దానికొకటి ఢీకొనడంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సేకరించిన వివరాల మేరకు గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో బస్టాండ్ వైపు నుంచి వేగంగా వస్తున్న ఆల్టో కారు సత్యంగారి హోటల్ జంక్షన్ వద్ద యూటర్న్ తీసుకునే క్రమంలో ముందు వెళ్తున్న వ్యాన్‌ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. వ్యాన్ డివైడర్‌ను ఢీకొట్టింది.
ముగ్గురు ప్రయాణికులకు
స్వల్ప గాయాలు..
అదే సమయంలో వారధి వైపు నుంచి బస్టాండ్ వైపు వేగంగా ఎర్టిగా, ఐ10 కార్లు వస్తున్నాయి. అప్పటికే పల్టీలు కొట్టి రోడ్డు మీద పడి ఉన్న ఆల్టో కారును ఐ10 కారు ఢీ కొనగా వెనుక వస్తున్న ఎర్టిగా కారు ఐ10 కారును ఢీకొట్టింది. దీంతో మూడు కార్లు, వ్యాన్ దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదం చూసిన స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై కారులో ఉన్న వారిని కాపాడేందుకు పరుగులు తీశారు. ఆల్టో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలవ్వగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కార్లలోని బెలూన్లు సైతం ఓపెన్ అయ్యాయంటే ప్రమాద తీవ్రత ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో కార్లను పక్కకు తీసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ప్రమాదానికి కారణమైన జంక్షన్‌ను వెంటనే పోలీసులు బారీకేడ్లతో మూసివేశారు. ప్రమాదాలు నిత్యకృత్యమైన ఈ కూడలిని శాశ్వతంగా మూసేస్తామని పోలీసులు తెలిపారు. కూడలిని మూసివేయడంతో కృష్ణలంక అండర్‌పాస్ వద్ద నిలిచిపోయిన ట్రాఫిక్‌ను ట్రాఫిక్ పోలీసులు క్రమబద్ధీకరించారు. ప్రమాదంపై వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కృష్ణలంక హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం