
కాసుల వేటలో నేతలు
బదిలీలు షురూ..
● ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం చర్యలు ● అనువైన స్థానాల్లో చోటు కోసం ఉద్యోగుల పాట్లు ● నేతల చుట్టూ ఉద్యోగుల ప్రదక్షిణలు ● సిఫార్సు లేఖల కోసం పడిగాపులు ● అందిన కాడికి దండుకునే పనిలో నేతలు
కంకిపాడు: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బదిలీలకు వచ్చే నెల 2వ తేదీ వరకూ అవకాశం ఇస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో ఉద్యోగులు తమకు అనువైన ప్రాంతాల్లో పోస్టు దక్కించుకోవటం కోసం నానా పాట్లు పడుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు, కూటమి నేతల మెప్పుతో పోస్టింగులను పదిలం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. సందట్లో సడేమియాగా ముఖ్య ప్రజాప్రతినిధులు తమ చేతికి మట్టి అంటకుండా ‘షాడో’లతో సిఫార్సులు అందిస్తున్నారు. ముఖ్యనేతలతో పాటు షాడోలు చక్రం తిప్పుతూ అందిన కాడికి కొమ్ము కాస్తూ పరిస్థితులను చక్కబెట్టుకుంటున్నారు.
పెద్ద ఎత్తున పైరవీలు
జిల్లా వ్యాప్తంగా 4,115 మంది ఉద్యోగులు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారు. రెండేళ్లు నిండిన వారు బదిలీలకు అర్హత కాగా, ఐదేళ్లు నిండిన వారు తప్పనిసరిగా బదిలీ కావాలని ప్రభుత్వ మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ మేరకు జిల్లాలో సగానికి పైగా ఉద్యోగులకు స్థానచలనం కలుగుతున్నట్లు తెలుస్తోంది. విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న సెమీ అర్బన్ ప్రాంతాల్లో పోస్టుల కోసం ఉద్యోగులు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సుల కోసం వారి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పెద్ద ఎత్తున పైరవీలు చేసుకుంటున్నారు.
చేతికి మట్టి అంటకుండా..
గత అనుభవాలతో కూటమి నేతలు జాగ్రత్త పడుతున్నారు. నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధులు తమ చేతికి మట్టి అంటకుండా ‘షాడో’లను రంగంలోకి దించారు. ఎక్కడికక్కడ మండల స్థాయిలో క్యాంపులు తెరిచారు. సచివాలయ ఉద్యోగుల నుంచి వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల వరకూ ఆ క్యాంపుల వద్ద పడిగాపులు పడుతున్నారు. బదిలీలకు సమయం మించి పోతుందనే కారణంతో సిఫార్సు లేఖల కోసం తిరుగుతున్నారు. తమకు అనుకూలమైన అధికారులను, సిబ్బంది తమ తమ నియోజకవర్గాల్లో కొలువుదీరేలా నేతలు సైతం కుస్తీ పడుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి వరకూ అందరికీ గులాం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. చోటా మోటా నేతలు కూడా సిఫార్సు లేఖలు ఇప్పిస్తామంటూ ఉద్యోగులను ఆకట్టుకుంటున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కార్యదర్శి సీటు కోసం గ్రామ స్థాయి నేతలకు లకారం వరకూ ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. మండల స్థాయి పోస్టులకు ఎంత మేరకు బేరం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలతో పాటు మున్సిపాలిటీ, నగర పంచాయతీ ఏరియాలకూ డిమాండ్ అధికంగా ఉంటోంది. ఆ మేరకే ‘షాడో’ నేతలు తమకు అనుకూలం అని చెప్పుకుంటూనే లెక్కలు సరిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నేతల కులపోకడ
ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో భాగంగా ఇచ్చే సిఫార్సుల విషయంలో నేతలు కులపోకడ వదలటం లేదు. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గ ప్రాభల్యం ఉన్న ప్రాంతాల్లో తమ వారు అయితేనే లేఖలు అంటూ బాహాటంగా చెబుతుండటం ఉద్యోగ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. అర్హతలతో పాటుగా పని విధానం, సిన్సియార్టీ చూడకుండా కేవలం కులాన్ని చూడటం ఏంటంటూ పెదవి విరుస్తున్నారంటే నేతల వ్యవహారశైలి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు బదిలీల్లో గత ప్రభుత్వంలో తమకు తీరని అన్యాయం జరిగిందనే వాదనను నిస్సిగ్గుగా లేవనెత్తుతున్న పరిస్థితి. బలవంతంగా తమను ఇక్కడి నుంచి బదిలీ చేశారంటూ కొందరు కూటమి నేతలను ప్రసన్నం చేసుకుని పోస్టులను పదిలం చేసుకుంటున్నారు. కొందరు అధికారుల వల్ల తమ పనులు ఏవీ నెరవేరలేదంటూ సాగనంపే పనిలోనూ నేతలు ఉన్నారు. తమకు అన్యాయం జరిగితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ఉద్యోగులు చెబుతున్నారు.