
దివ్యాంగులకు తప్పని తిప్పలు
● పూర్తి స్థాయిలో హాజరు కాని వైద్యులు ● ప్రహసనంలా సదరం ధ్రువపత్రాల పునఃపరిశీలన
మచిలీపట్నంటౌన్: స్థానిక జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో నిర్వహిస్తున్న సదరం దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాల పునఃపరిశీలన కార్యక్రమం ప్రహసనంలా మారింది. ఎన్నో ఏళ్లుగా జిల్లా వ్యాప్తంగా పింఛన్లు పొందుతున్న దివ్యాంగుల వికలాంగ శాతాన్ని పునఃపరిశీలించి ఉన్న పింఛన్లను తొలగింపే లక్ష్యంగా కూటమి పాలకులు ఆస్పత్రిలో కొద్ది నెలలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పలు మండలాలకు చెందిన పింఛన్లు పొందుతున్న దివ్యాంగులకు ఆయా ప్రాంతాల్లోని సచివాలయాల సిబ్బంది ఫలానా తేదీన ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని నోటీసులు ఇస్తున్నారు. ఈ నోటీసులతో వారంతా జిల్లా ఆస్పత్రికి తరలివచ్చి సంబంధిత విభాగ వైద్యులతో పరీక్షలు చేయించుకుని వెళ్తున్నారు. మొదట్లో సోమ, మంగళ, బుధ వారాల్లో ఈ పరీక్ష శిబిరాలను నిర్వహించారు. ప్రస్తుతం ఈ శిబిరాలు బుధ, గురు, శుక్రవారాల్లో నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాలకు ఇక్కడి వైద్యులు కాకుండా విజయవాడ, గుంటూరు, గుడివాడ ఇలా తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో పని చేస్తున్న జూనియర్, సీనియర్ వైద్యులు హాజరవుతున్నారు.
పూర్తి స్థాయిలో హాజరుకాని వైద్యులు...
ఈ సదరం ధ్రువీకరణ పత్రాల పునఃపరిశీలన శిబిరాలకు ఆయా విభాగాలకు చెందిన వైద్యులు పూర్తిస్థాయిలో హాజరై సేవలందించకపోవటంతో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడికి వస్తున్న వైద్యుల వద్దకు కూటమి పార్టీలకు చెందిన నాయకులు వెళ్లి ఫలానా దివ్యాంగులకు ఎక్కువ వికలాంగ శాతం వేయాలని ఇటీవల కాలంలో పైరవీలు అధికమయ్యాయి. దీంతో విసుగు చెందిన పలువురు వైద్యులు ఈ శిబిరాలకు వచ్చి సేవలందించేంకు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల రాజధాని అమరావతి సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరైన సందర్భంలో ప్రత్యేక విధులు నిర్వహించటంతో మరి కొంత మంది వైద్యులు శిబిరాలకు రావటం లేదు. వైద్యులు ప్రతి రోజు 25 మంది దివ్యాంగులకు పరీక్షలు చేయాల్సి ఉంది. అయితే వైద్యులు పూర్తి స్థాయిలో హాజరుకాకపోవటం, పలు మార్లు శిబిరాలు రద్దు కావటంతో దివ్యాంగులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో అరకొరగా వస్తున్న వైద్యులు దివ్యాంగులందరికీ పరీక్షలు చేయకపోవటంతో వారు రోజుల తరుబడి నిరాశతో వెనుతిరగాల్సివస్తోంది. తాము రోజుకు 25 మందినే పరీక్షించాల్సి ఉండగా 75 మందికి పైగానే చూడాల్సి వస్తోందని తమపై పని భారం పెరుగుతోందని విధులకు వస్తున్న వైద్యులు వాపోతున్నారు. దీంతో దివ్యాంగులకు ఇబ్బందులు తప్పటం లేదు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి తమకు ఇబ్బంది కలగకుండా చూడాలని దివ్యాంగులు కోరుతున్నారు.