
ప్రైవేటుకే పటుత్వం!
గన్నవరం: ప్రభుత్వంలో కీలకమైన రవాణా శాఖ ఒక్కొక్క బాధ్యతల నుంచి తప్పుకుంటోంది. ఇప్పటికే రవాణా శాఖకు చెందిన అనేక సేవలను ఆన్‌లైన్ చేసింది. పలు సేవలను ప్రైవేట్ పరం చేసింది. కొత్తగా వాహన పటుత్వ (ఫిట్‌నెస్) పరీక్ష నిర్వహణ బాధ్యతలను కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించనుంది. ఇప్పటి వరకు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ)పర్యవేక్షణలో నిర్వహించిన వెహికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లు ఇకపై పూర్తిగా ఆటోమెటిక్ విధానంలో జరగనున్నాయి. ఇప్పటికే కర్నూలు, నంద్యాల, గుంటూరు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రిలో ఫిట్‌నెస్ టెస్ట్‌లను ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. కొత్తగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ ఇప్పటికే విజయవాడ రూరల్ మండలం నున్న పరిధిలో టెస్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
నిత్యం రద్దీగా గన్నవరం కేంద్రం..
ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా గుర్తింపు పొందిన విజయవాడలోని రవాణా శాఖ కార్యాలయానికి అనుసంధానంగా గన్నవరం ఎయిర్‌పోర్ట్ ఎదురుగా వాహన పటుత్వ, వాహన చోదక యోగ్యత పరీక్ష నిర్వహణ కేంద్రం నడుస్తోంది. వెహికల్ ఫిట్‌నెస్ పరీక్షల నిమిత్తం విజయవాడ రవాణా శాఖ పరిధిలోని వేలాది ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు ఇక్కడికి వస్తుంటాయి. ఈ వాహనాలకు ఎంవీఐ దగ్గర ఉండి బ్రేక్‌లు, ఛాసిస్, ఇంజిన్ నంబర్లు, సిగ్నల్ లైట్లు, ఇంజిన్ పనితీరు, గేర్ బాక్స్, ఎయిర్ ప్రెజర్‌ను వంటి విభాగాలను పరీక్షించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ మంజూరు చేస్తుంటారు. సదరు వాహనం ప్రమాదానికి గురైనప్పుడు ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించిన ఎంవీఐ వెళ్లి వాహనం పరిస్థితిని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఫిట్‌నెస్ టెస్ట్‌లకు వచ్చే వాహనదారులు, సంబంధిత వ్యక్తులతో గన్నవరం కేంద్రం నిత్యం రద్దీగా దర్శనమిచ్చేది. ఇప్పుడు వెహికల్ ఫిట్‌నెస్ టెస్ట్ బాధ్యతలను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడంతో రానున్న రోజుల్లో ఈ కేంద్రం నిరుపయోగంగా మారనుంది.
బీవీఎస్‌ఆర్ సంస్థకు కాంట్రాక్టు..
వెహికల్ ఫిట్‌నెస్ టెస్ట్ కాంట్రాక్ట్‌ను బీవీఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. ఆ సంస్థ వాహన పటుత్వ పరీక్షల నిర్వహణ నిమిత్తం నున్న సమీపంలోని వికాస్ కళాశాలకు వెళ్లే రోడ్డులో సెంటర్‌ను సిద్ధం చేసింది. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తిచేసింది. ఎంవీఐలతో సంబంధం లేకుండా పూర్తిగా కంప్యూటరైజ్డ్ విధానంలో యంత్రాల సహాయంతో వెహికల్ ఫిట్‌నెస్ పరీక్షలను నిర్వహించనుంది. సదరు టెక్నికల్ రిపోర్ట్ ఆధారంగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను జారీచేయనున్నారు. అయితే ప్రైవేట్ సంస్థల పర్యవేక్షణలో జరిగే వాహన పటుత్వ పరీక్షలకు ఎంత వరకు కచ్చితత్వం ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రైవేట్ సంస్థ చేతికి వెహికల్ ఫిట్‌నెస్ టెస్ట్ బాధ్యతలు
ఎంవీఐ పర్యవేక్షణలో మాన్యువల్ పరీక్షలకు స్వస్తి ఆటోమేటిక్ విధానంలో నిర్వహణకు ఏర్పాట్లు విజయవాడ రూరల్ పరిధిలోని నున్న వద్ద కేంద్రం ఏర్పాటు