
యోగాంధ్ర స్ట్రీట్‌గా బీఆర్టీఎస్ రోడ్డు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా కనీసం రెండుకోట్ల మందికి యోగాలో ప్రవేశం లక్ష్యంతో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. ఇందులో భాగంగా జూన్ 21 విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో రోజూ ఉదయం 5.30 గంటల నుంచి 7.30 గంట ల వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా గురువారం విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ రోడ్డులోని శారదా కళాశాల జంక్షన్ వద్ద ప్రత్యేక యోగాభ్యసన కార్యక్రమం జరిగింది. ఇందులో కలెక్టర్ లక్ష్మీశ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్‌ఎం తదితరులు పాల్గొని యోగాసనాలను సాధన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మనిషి జీవన నాణ్యతను పెంచేందుకు, శ్రేయస్సుకు యోగా గొప్ప మార్గమని వివరించారు. ఇతివృత్తం ఆధారిత యోగా సెషన్లతో పాటు వివిధ పర్యాటక ప్రాంతాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. ట్రైనర్లు, పౌరుల రిజిస్ట్రేషన్‌కు ఏర్పాటు చేస్తున్నామని.. ఈ నెల రోజుల పాటు యోగాసనాల అభ్యసనతో పాటు ఆసనాల ప్రదర్శన, సూర్య నమస్కార్, ప్రాణాయామ ప్రదర్శన, గ్రూప్ యోగా, ఆర్టిస్టిక్ యోగా.. ఇలా వివిధ విభాగాల్లో పోటీలు కూడా నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. ప్రతిఒక్కరూ మరో ముగ్గురిని యోగాచరణ దిశగా ప్రోత్సహించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
మన చారిత్రక సంపదను
సద్వినియోగం చేసుకోవాలి..
యోగా అనేది భారతీయ వారసత్వ, చారిత్రక సంపద అని.. ఈ సంపదను సద్వినియోగం చేసుకొని.. శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు కావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్‌ఎం ధ్యానచంద్ర అన్నారు. యోగా అభ్యసనను ఏ ఒక్క రోజుకో పరిమితం చేయకుండా జీవితాంతం ప్రతిరోజూ యోగాను ఆచరించడం వల్ల కొత్త ఉత్తేజంతో మంచి ఫలితాలు సాధించొచ్చని పేర్కొన్నారు. విజయవాడ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, చీఫ్ ఇంజినీర్ ఆర్.శ్రీనాథ్ రెడ్డి, ఇన్‌చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
జూన్ 21 వరకు రోజూ ఉదయం ప్రత్యేక యోగా కార్యక్రమాలు వివరాలు వెల్లడించిన కలెక్టర్ జి.లక్ష్మీశ