పెండింగ్ అర్జీలను పరిష్కరించాలి
పీజీఆర్‌ఎస్‌లో డీఆర్వో చంద్రశేఖరరావు
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు ఆదేశించారు. కలెక్ట రేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం పీజీ ఆర్‌ఎస్ (మీ–కోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఆర్వోతో పాటు కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, బందరు ఆర్డీఓ కె.స్వాతి, సమగ్ర శిక్ష ఏపీసీ కుమిదిని సింగ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. డీఆర్వో మాట్లాడుతూ.. పెండింగ్ అర్జీలను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. ప్రస్తుతం అందుతున్న అర్జీలతో పాటు వివిధ శాఖల వద్ద పరిష్కరించాల్సిన గతంలోని కొన్ని అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయని వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలన్నారు. రక్తహీనత, తలసేమియా బాధితులతో పాటు గర్భిణులకు అత్యవసర పరిస్థితుల్లో రక్తాన్ని అందించేందుకు అవసరమైన రక్తాన్ని సేకరించేందుకు నియోజకవర్గాల వారీగా మండలస్థాయిలో రక్తదాన శిబిరాలను నిర్వహించాలన్నారు. వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అవసరమైన వాటికి సకాలంలో కౌంటర్ దాఖలు చేయాలన్నారు. ఈ కార్య క్రమంలో అధికారులు 125 అర్జీలను స్వీకరించారు.
ముఖ్యమైన అర్జీలు ఇవీ..
● గుడివాడలోని ఏఎన్‌ఆర్ కళాశాలలో ఎంబీఏలో చేరానని, ఆర్థిక సమస్యల కారణంగా చదువును కొనసాగించలేకపోయానని, 2020వ సంవత్సరంలో అడ్మిషన్ల సమయంలో తన వద్ద నుంచి తీసుకున్న సర్టిఫికెట్లను పూర్తి ఫీజు చెల్లించ కుండా ఇవ్వనంటున్నారని తన ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇప్పించాలని పెదపారుపూడి మండలం మహేశ్వరపురం గ్రామానికి చెందిన సీహెచ్. శ్యామన్ అర్జీ ఇచ్చారు.
● తమ గ్రామంలో పంటబోదెలను యంత్రాలతో తవ్వి మట్టిని యథేచ్ఛగా రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, ఉపాధి హామీ పథకం ద్వారా పూడికతీత పనులు చేపట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని బందరు మండలం గుండుపాలెం గ్రామస్తులు అర్జీ ఇచ్చారు.
● మచిలీపట్నం – విజయవాడ జాతీయ రహదారిలోని మొవ్వ మండలం నిడుమోలు గ్రామం వద్ద సర్వీస్ రోడ్డు సరిగా లేక వాహనదారులు, ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జాతీయ రహదారి అధికారులను అడిగితే స్పందించటం లేదని సర్వీస్ రోడ్డు, డ్రెయిన్ల నిర్మాణం చేయాలని కోరుతూ గ్రామస్తులు అర్జీ ఇచ్చారు.


