సర్దుబాటు ప్రక్రియపై ఉపాధ్యాయుల నిరసన
చిలకలపూడి(మచిలీపట్నం): పాఠశాలల పునఃవ్యవ స్థీకరణ ప్రక్రియలో భాగంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చర్య తమకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం మచిలీ పట్నంలోని ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. జీఓ నంబరు 117ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దాని స్థానంలో కొత్త జీఓ విడుదల చేసిన అనంతరం పాఠశాలలను పునః వ్యవస్థీకరించాలని కోరారు. అన్ని ప్రాథమిక పాఠశాలల్లో 1ః20 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలని పేర్కొన్నారు. అన్ని మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో ఐదు తరగతులను బోధించడానికి ఐదుగురు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. విద్యార్థుల సంఖ్య 75కు మించితే పీఎస్, హెచ్‌ఎం పోస్టులను అద నంగా కేటాయించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల సంఖ్య 130 మించితే ఆరో ఎస్జీటీ, ప్రతి 30 మందికి ఒక ఎస్జీటీని, అన్ని ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూలు అసిస్టెంట్ పోస్టులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని కోరారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మను కలెక్టరేట్‌లోని సమావేశంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.ఎ.ఉమామహేశ్వరరావు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎండీ షౌకత్‌హుస్సేన్, బి.కనకా రావు, జె.లెనిన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


