
ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు
మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ విద్యా విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) జిల్లాశాఖ దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా అధ్యక్షుడు అంబటిపూడి సుబ్రహ్మణ్యం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా మే 5న పాత తాలూకా కేంద్రాల్లో, మే 9న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మే 14న రాష్ట్ర స్థాయిలో భారీగా ధర్నా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రాథమిక పాఠశాలలు అంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకే అయినప్పటికీ, ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలలను ఏర్పాటు చేయడం విద్యావ్యవస్థలో గందరగోళానికి దారితీస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు భారీగా పాల్గొని నిరసన కార్యక్రమాల విజయవంతం చేయాలని ఆయన కోరారు.
భగీరథ మహర్షిని స్ఫూర్తిగా తీసుకోవాలి
చిలకలపూడి(మచిలీపట్నం): భగీరథ మహర్షి స్ఫూర్తితో జీవితంలో అనుకున్నది సాధించవచ్చని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో ఆదివారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తపస్సుతో గంగను దివి నుంచి భువికి దించిన భగీరథుడు పట్టుదలకు మారుపేరుగా నిలిచారన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చన్నారు. డీఆర్వో కె. చంద్రశేఖరరావు, కలెక్టరేట్ ఏవో సీహెచ్ వీరాంజనేయప్రసాద్, బీసీ సంక్షేమశాఖ అధికారులు, సగర కులసంఘ నాయకులు పాల్గొన్నారు.
చదరంగంలో జస్వంత్, మోధిత సత్తా
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి అండర్–9 చెస్ పోటీల బాలుర విభాగంలో పి.జస్వంత్, బాలికల విభాగంలో వి.మోధితరెడ్డి విజేతలుగా నిలిచారు. విజయవాడ శివారు కానూరులోని స్కాట్స్‌పైన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో గత రెండు రోజులుగా జరుగుతున్న పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. బాలుర విభాగంలో పి.జయసాకేత్ 6/7 పాయింట్లతో, బాలికల విభాగంలో వై.శ్రీనిఖిల 5.5/7 పాయింట్లతో రన్నర్‌లుగా నిలిచారు. 26 జిల్లాల నుంచి 134 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల బాల, బాలికల విభాగంలో టాప్–8 క్రీడాకారులకు రూ.40 వేల నగదు బహుమతిని మంజూరు చేశారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో మేజర్ కె.ఆర్.శేషాద్రిరావు, స్కాట్స్‌పైన్ స్కూల్ సీఈవో కొడాలి జాహ్నవి తదితరులు ట్రోఫీలు, నగదు బహుమతిని అందజేశారు. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశామని, జూన్‌లో హరియాణాలో జరిగే జాతీయ పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందని ఆంధ్ర చెస్ అసోసియేషన్ కార్యానిర్వాహక కార్యదర్శి, కృష్ణాజిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి ఎన్.ఎం.ఫణికుమార్ తెలిపారు.
భక్తజన కోలాహలం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానం ఆదివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. ఆదివారం ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. తెల్లవారుజాము నుంచి క్యూలైన్‌లన్నీ భక్తులతో నిండిపోయాయి. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వర ప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు

ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు