
చోరీలు అరికట్టేందుకు ప్రజలూ సహకరించాలి
ఎస్పీ ఆర్.గంగాధరరావు
కోనేరుసెంటర్: వేసవిలో దొంగతనాలను అరికట్టేందుకు ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు శనివారం కోరారు. వేసవి శెలవులను పురస్కరించుకుని ప్రజలు తమ పిల్లలతో కలిసి తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్తున్నవారు తమ ఇళ్లల్లో దొంగతనాలు జరగకుండా ఉండాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాధారణ రోజులతో పోల్చితే వేసవిలో దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటున్నందున నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసినట్లు తెలిపారు. ఇళ్లకు తాళం వేసుకుని ఊరికి వెళ్లేవారు ఆ సమాచారాన్ని స్థానిక పోలీసులకు తెలియజేస్తే ఆయా ఇళ్లపై నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. ఇంటి పరిసరాలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు కనబడేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, అలారం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం మంచిదన్నారు. ఇంటి బయట ఎప్పుడు లైట్ వెలిగేలా చూసుకోవాలన్నారు. తద్వారా చోరులకు ఇంట్లో ఎవరూ లేరనే అనుమానం రాదన్నారు. చుట్టుపక్కల అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు గమనించినట్లయితే సమీప పోలీసులకు సమాచారం అందజేయాలని ప్రజలను కోరారు.