
రెండేళ్ల తర్వాత తల్లి చెంతకు చేరిన బాలుడు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రెండేళ్ల క్రితం తప్పిపోయిన బాబును నవజీవన్ బాలభవన్ సురక్షితంగా తల్లి చెంతకు చేర్చింది. వివరాలు... కృష్ణాజిల్లా పెదకళ్లేపల్లికి చెందిన బుజ్జిబాబు(12) అనే బాలుడు రెండేళ్ల క్రితం 2023 జూలై 3న తప్పిపోయాడు. అదే గ్రామానికి చెందిన మహిళా సంరక్షక అధికారి భానుప్రియ కంటబడడంతో ఆమె రక్షించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట ప్రవేశపెట్టారు. కమిటీ తాత్కాలిక వసతి కోసం బాబును నవజీవన్ బాలభవన్ ఓపెన్ షెల్టర్‌కు అప్పగించింది. షెల్టర్‌లో నిత్యావసరాలు అందించి కౌన్సెలింగ్ నిర్వహించగా తనది పెద్ద కళ్లేపల్లి గ్రామమని, ఇతర వివరాలు తెలియవని చెప్పాడు. తల్లిదండ్రుల వివరాలు చెప్పలేదు. నవజీవన్ ఫీల్డ్ స్టాఫ్ బాబును పెదకళ్లేపల్లి గ్రామానికి తీసుకెళ్లి వివరాలు సేకరించే ప్రయత్నాలు చేయగా ఫలించలేదు. అక్కడి పెద్దలను కలవగా బాబు తల్లిదండ్రులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు తెలిపారు. ఆ తర్వాత బుజ్జిబాబును తిరిగి సీడబ్ల్యూసీ ముందు ప్రవేశపెట్టగా చిగురు చిల్డ్రన్స్ హోంకు, ఆ తర్వాత దీపానివాస్‌కు పంపారు. రెగ్యులర్ స్కూల్ జాయినింగ్, ఆధార్ కార్డు కోసం సిబ్బంది బాబును మరోసారి పెద్దకళ్లేపల్లి గ్రామానికి తీసుకెళ్లగా అక్కడ పాఠశాల ఉపాధ్యాయుడు అతని వివరాలు తెలియజేశారు. స్కూల్‌లో జాయిన్ చేసినా వెళ్లకపోవడంతో మళ్లీ నవజీవన్ బాలభవన్‌కు పంపారు. అక్కడ కౌన్సెలింగ్ ఇస్తూ మరోసారి తల్లిదండ్రుల కోసం ప్రయత్నించగా తల్లి వివరాలు తెలిశాయి. దీంతో నవజీవన్ బాలభవన్ సిబ్బంది బాలుడిని అతని తల్లి చంద్రకళకు సురక్షితంగా అప్పగించారు. కార్యక్రమంలో నవజీవన్ బాల భవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాదర్ నీలం రత్న కుమార్, సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ కె.సువార్త, ప్రసన్నకుమారి, మమత తదితరులు పాల్గొన్నారు.