పరిష్కారం తక్కువ | - | Sakshi
Sakshi News home page

పరిష్కారం తక్కువ

Mar 18 2025 10:03 PM | Updated on Mar 18 2025 10:01 PM

ఆర్భాటం ఎక్కువ..
అర్జీదారులకు భరోసా ఇవ్వని పీజీఆర్‌ఎస్‌

నాలుగు సార్లు తిరిగినా పరిష్కారం కాలేదు

మా బంధువులకు ఉన్న 90 సెంట్ల భూమిలో 12 సెంట్ల భూమి సహకార సంఘానికి, ఐదు సెంట్ల భూమిని స్కూలు భవనానికి ఇచ్చాం. మిగిలిన భూమిని మేము విక్రయించుకునే వీలు లేకుండా మొత్తం ప్రభుత్వ భూమిని 22ఏలో చేర్చారు. ఈ విషయంపై ఈ ప్రభుత్వం వచ్చాక నాలుగు సార్లు కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌కు వచ్చా. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ఈ రోజు జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తే అర్జీ తీసుకుని పరిశీలిస్తామన్నారు. నా సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో తెలియటం లేదు.

– దివి శ్రీనివాసరావు,

కానూరు, బందరు మండలం

పింఛను రాకుండానే మృతి

62 సంవత్సరాల వయసులో పామర్రు గ్రామానికి చెందిన ఆరేపల్లి వెంకటాచలం వికలాంగ పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పింఛను మంజూరు చేయాలని నాతో పాటు దరఖాస్తు చేసుకునేందుకు కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి పలుమార్లు వచ్చాడు. అయినా కొత్త పింఛను మంజూరు చేయలేదు. పింఛను రాలేదన్న దిగులుతో 2024 డిసెంబరు 23న అతను మరణించాడు. ప్రస్తుతం ఆయన భార్య వెంకటేశ్వరమ్మౖ కెనా వృద్ధాప్య పింఛను మంజూరు చేయాలని కలెక్టర్‌కు అర్జీ ఇచ్చా.

– జంపాన శ్రీనివాసగౌడ్‌, సామాజిక కార్యకర్త

చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) అమలు తీరు ప్రచార ఆర్భాటం ఎక్కువ.. సమస్యల పరిష్కారం తక్కువ.. అన్న చందంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమస్యలను పరిష్కరించకుండానే పరిష్కరించినట్లు అధికారులు నమోదు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పరిష్కరించామని అధికారులు చెబుతున్న సమస్యలపై మళీమళ్లీ పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు అందడమే ఇందుకు నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని 2024 జూన్‌ 15వ తేదీన ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ప్రతి సోమవారం ఈ కార్యక్రమన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు 17,194 అర్జీలు వచ్చాయి. వీటిలో 14,936 అర్జీలు పరిష్కారమైనట్లు అధికారులు రికార్డుల పరంగా చూపుతున్నారు. కేవలం 2,258 అర్జీలను మాత్రమే పరిష్కరించాల్సి ఉందని పేర్కొంటున్నారు. తాము స్వీకరించిన అర్జీలను ఉన్నతాధికారులు సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే సంబంధిత శాఖల అధికారులు తూతూ మంత్రంగా అర్జీదారులకు ఎండార్స్‌మెంట్‌ ఇచ్చి ఆ అర్జీని పరిష్కరించామని వారి ఫోనులకు మెసేజ్‌ల రూపంలో పంపుతున్నారు. అయితే ఆ అర్జీదారుడు తిరిగి అదే సమస్యపై మళ్లీ పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి వస్తున్నారు. ‘మీరు చెప్పినప్పటికీ కిందిస్థాయి అధికారులు ఆ దిశగా మాకు పరిష్కారం చూపటం లేదు’ అని కలెక్టర్‌కు అర్జీదారులు చెబుతున్నారు.

గతంలో నాణ్యమైన పరిష్కారం

గత ప్రభుత్వంలో అర్జీదారులకు భరోసా ఉండేది. అర్జీ ఇచ్చిన వెంటనే నిర్ణీత సమయంలోగా నాణ్యమైన పరిష్కారం చూపేలా ఉన్నతాధికారులు సంబంధిత ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చేవారు. ఆ అర్జీలు ఒకవేళ రీ–ఓపెన్‌ అయితే సంబంధిత అధికారులకు మెమోలు జారీ చేసే వారు. దీంతో సంబంధిత అధికారులు అర్జీదారుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు. ప్రస్తుతం పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో వచ్చిన అర్జీలో ఉన్న సమస్యలను కిందిస్థాయి అధికారులకు పంపి చేతులు దులుపుకొంటున్నారు. ఫలితంగా సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు కలెక్టరేట్‌, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని అర్జీదారులు వాపోతున్నారు.

పీజీఆర్‌ఎస్‌కు హాజరుకాకుంటే చర్యలు

మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పలువురు గైర్హాజరయ్యారు. వారిపై కలెక్టర్‌ డి.కె.బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి హాజరు కాని అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయా లని డీఆర్వో చంద్రశేఖరరావును ఆదేశించారు. ఇదే తప్పిదాన్ని రెండు, మూడు సార్లు చేస్తే ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులకు రిపోర్టు చేస్తా నని కలెక్టర్‌ హెచ్చరించారు. కృత్తివెన్ను ఈఓపీఆర్డీ కోర్టు ఆర్డరును అమలు చేయకపోవడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్‌లో ఈఓపీఆర్డీతో మాట్లాడి కోర్టు ఆర్డర్‌ను తక్షణమే అమలు చేయాలని, లేకపోతే సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు. ఈ నెల 25, 26 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్న దృష్ట్యా శాఖాపరంగా వివరాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో అధికారులు 145 అర్జీలను స్వీకరించారు.

తాము ఉంటున్న ఇంటిని తమ కుమారుడి పేరు మీద రాశా మని, దానిని అతను బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకుని, బాకీ చెల్లించకుండా వెళ్లిపోయాడని, బ్యాంకు అధికారులు తమ వద్దకు వచ్చి ఇల్లును జప్తు చేస్తాం, తాళాలు వేసేస్తామని తమను వేధింపులకు గురిచేస్తు న్నారని ఉయ్యూరు మండలం కాటూరు గ్రామానికి చెందిన వృద్ధులు ప్రొద్దుటూరి బాబూరావు దంపతులు సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.

కూటమి పాలనలో జిల్లాలో 17,194 అర్జీల స్వీకరణ

14,936 అర్జీలను పరిష్కరించామంటూ గొప్పగా ప్రచారం

ఆ సమస్యలపై మళ్లీమళ్లీ అర్జీలు దాఖలవుతున్న వైనం

బ్యాంకు అధికారులు

వేధిస్తున్నారు

పరిష్కారం తక్కువ 1
1/2

పరిష్కారం తక్కువ

పరిష్కారం తక్కువ 2
2/2

పరిష్కారం తక్కువ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement