చిలకలపూడి(మచిలీపట్నం): విధి నిర్వహణలో కష్టపడి, అంకితభావంతో పనిచేయాలని కృష్ణా కలెక్టర్ పి. రంజిత్‌బాషా సూచించారు. ప్రజా రవాణాశాఖ ఆధ్వర్యంలో ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేసి మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు వారి అర్హతల మేరకు శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో 32 మందికి కారుణ్య నియామకపత్రాలను అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అప్పగించిన పనులను నమ్మకం, నిబద్ధతతో పూర్తిచేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందారన్నారు. అలాగే కుటుంబ సభ్యులను కూడా బాగా చూసుకోవాలని హితవు పలికారు. వివిధ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వీఆర్వోలు, మహిళా పోలీస్, పంచాయతీ కార్యదర్శుల పోస్టుల్లో వీరిని నియమించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎం. వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏవో జీవీ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
పాఠశాలల ప్రారంభానికి ముందే పాఠ్య పుస్తకాలు
ఆటోనగర్(విజయవాడతూర్పు): వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు చేరేలా అధికారులు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా జవహర్ ఆటోనగర్‌లోని జిల్లా ప్రభుత్వ పాఠ్యపుస్తక విక్రయ కార్యాలయానికి హైదరాబాద్ నుంచి ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా కొన్ని పాఠ్య పుస్తకాలు చేరాయి. శుక్రవారం 3వ తరగతి మ్యాథమ్యాటిక్స్ సెమ్–1, 4వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకాలు మొత్తం 51,697 వచ్చినట్టు మేనేజర్ బలిజేపల్లి నాగమల్లేశ్వరరావు చెప్పారు. ఈ ఏడాది మే నెలకల్లా అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో వస్తాయని ఆయన చెప్పారు. జూన్ మొదటి వారానికి కృష్ణా ఉమ్మడి జిల్లాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలకు ఈ పాఠ్య పుస్తకాలు చేరవేస్తామని పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీ బుక్ లెట్స్ ఆవిష్కరణ
చిలకలపూడి(మచిలీపట్నం): డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ శిక్షణ మాన్యువల్ బుక్‌లెట్స్‌ను శుక్రవారం కృష్ణా కలెక్టర్ పి. రంజిత్‌బాషా ఆయన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఆరోగ్యమిత్రలు, సచివాలయంలోని ఏఎన్‌ఎంలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందిస్తున్న సేవల వివరాలపై పూర్తి అవగాహన కల్పించేందుకు ఈ బుక్‌లెట్లు రూపొందించారన్నారు. జిల్లాలో 508 మంది సచివాలయ ఏఎన్‌ఎంలకు, 147 మంది ఆరోగ్య మిత్రలకు ఈ బుక్‌లెట్లను అందజేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందిస్తున్న సేవల వివరాలను సమగ్రంగా ఇందులో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జి. గీతాబాయి, ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్డినేటర్ జె. సుమన్ తదితరులు పాల్గొన్నారు.
కేఎల్‌యూ ప్రవేశ పరీక్ష
ఫలితాల విడుదల
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్‌లలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ శుక్రవారం విడుదల చేశారు. నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో అమర్‌నాథ్ పాల్గొని బటన్ నొక్కి ఫలితాలు విడుదల చేసి, ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధికి ఉపయోగపడే పరిశోధనలపై యువత దృష్టి సారించాలని సూచించారు. కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలు www. kluniversity.in వెబ్‌సైట్‌లో లభిస్తాయని తెలిపారు. కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ షణ్ముఖ్‌కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్స్ బీఎస్‌ఎన్ మూర్తి, హెచ్‌ఎస్‌ఆర్ మూర్తి పాల్గొన్నారు.


