కెరమెరి: అక్షరమే జీవితానికి అండగా నిలుస్తుంద ని, తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. కెరమెరి మండలం గోయగాం ప్రాథమిక పాఠశాలలో బుధవారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మా ట్, డీఈవో సచ్చిదానంద చారితో కలిసి చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. గ్రామస్తులందరూ కలిసి పాఠశాలను అభివృద్ధి చేసుకోవడంపై అభినందించారు. తన వంతుగా రూ.5వేలు విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు చైతన్యమైతేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తాగునీటి సమస్యల పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఇటీవల చుక్కా రామయ్య పాఠశాలలో సీట్లు సాధించిన పది మంది విద్యార్థులను సన్మానించారు. క్వాలిటీ కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్, ఎస్‌వో శ్రీనివాస్, ఎంఈవో ఆడే ప్రకాశ్, హెచ్‌ఎంలు మహేశ్వర్, కడేర్ల రంగయ్య, సర్పంచ్ ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు.
విస్తృత ప్రచారం చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణపై జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు నిర్వహించే కార్యక్రమాలపై దినపత్రికలు, ప్రసార సాధనాలతో ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీపీఆర్వో సంపత్ కుమార్, జిల్లా మీడియా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ బీమా చేసుకోవాలి
ఆసిఫాబాద్: జిల్లాలో అర్హులైన ప్రతిఒక్కరూ బీమా చేసుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బీమాదారుల కుటుంబాలకు బుధవారం చెక్కులు పంపిణీ చేశారు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ మంచిర్యాల బ్రాంచ్‌లో పీఎం జీవన్‌జ్యోతి బీమా యోజన చేయించుకున్న బెజ్జూర్ మండలం మొగవెల్లి గ్రామానికి చెందిన సీహెచ్ లక్ష్మి మృతి చెందగా కుటుంబ సభ్యురాలు పెంటుబాయికి రూ.2 లక్షల చెక్కు అందజేశారు, రాయల్ సుందరం పథకంలో రూ.565 ప్రీమియం చెల్లించి బీమా చేసుకున్న అదే గ్రామానికి చెందిన కనక కమల పాముకాటుతో మృతి చెందగా, ఆమె కుమారుడు సుధాకర్‌కు రూ.10 లక్షల బీమా చెక్కు అందించారు. కార్యక్రమంలో తపాలాశాఖ సీనియర్ మేనేజర్ కొట్టే శ్రీనివాస్, మేనేజర్ సాగర్, రాయల్ సుందరం కంపెనీ రీజినల్ మేనేజర్ ధన్‌రాజ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


