అభ్యర్థులకు ప్రయాణ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

అభ్యర్థులకు ప్రయాణ పరీక్ష

Jun 17 2026 11:53 PM | Updated on Jun 17 2026 11:53 PM

● జిల్లాకు దూరంగా టెట్‌ కేంద్రాలు ● రాకపోకలు, ఇతర ఖర్చులతో అదనపు భారం

కాగజ్‌నగర్‌టౌన్‌: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌– 2026కు హాజరయ్యే జిల్లా అభ్యర్థులపై అదనపు భారం పడుతోంది. జిల్లాకు దూరంగా కేంద్రాలు కేటాయించడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు టెట్‌ జరుగనుంది. ఈ పరీక్షలు సీబీటీ విధానంలో కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు నిర్వహిస్తున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి సుమారు నాలుగు వేల మంది ఈ పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులకు వరంగల్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌ నగర్‌, మెదక్‌ వంటి దూర ప్రాంతాల్లో పరీక్ష సెంటర్లు కేటాయించారు. చాలామంది ఒక్కరోజు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు.

జిల్లాలోనే నిర్వహించాలి

ఏటా టెట్‌ రాయాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్‌ ఫీజు రూ.వెయ్యి, ప్రయాణ ఖర్చులు మరో రూ.వెయ్యి.. ఇలా అన్ని ఖర్చులు భరించుకోవాలి. ఉద్యోగం లేకనే పోటీ పరీక్షలకు హాజరవుతున్నాం. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు జిల్లాలోనే పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

– విద్యాసాగర్‌, కాగజ్‌నగర్‌

ప్రయాణాలతో ఇబ్బంది

వరంగల్‌, హైదరాబాద్‌ పట్టణాల్లో కేంద్రాలు కేటాయిస్తే ఇక్కడి నుంచి వెళ్లడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఉదయాన్నే భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌కు వెళ్లాలి. లేదంటే ఒక్క రోజు ముందుగా ఆయా పట్టణాలకు చేరుకోవాలి. అక్కడ బంధువులు ఉంటే వారి ఇళ్లలో ఉండాలి.

– సంధ్య, కాగజ్‌నగర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement