కౌటాల: వర్షాకాలం సీజన్ ప్రారంభమై 15 రోజులు గడిచింది. అయినా మృగశిర కార్తెలో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి మాదిరిగానే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచే వేడి, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. బుధవారం దహెగాం మండలం కుంచవెల్లిలో అత్యధికంగా 43.3 డిగ్రీల సెల్సియస్‌గా పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా, బెజ్జూర్ 43.3, సిర్పూర్(టి) 43.2, తిర్యాణి 43.0, గోలేటి 42.7, రెబ్బెన 42.6, వాంకిడిలో 42.2 డిగ్రీలు నమోదైంది. జిల్లాలోని 15 మండలాలు అలర్ట్ జోన్‌లో ఉన్నాయి. ఎండలకు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండగా, వానలు లేక సాగు పనులు జోరందుకోవడం లేదు. భారీ వర్షాల కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.


