టూరిజం బాగుండాలని.. | - | Sakshi
Sakshi News home page

టూరిజం బాగుండాలని..

Jun 14 2026 7:22 AM | Updated on Jun 14 2026 7:22 AM

● జలపాతం చెంత సకల వసతులు ● ఏటా పెరుగుతున్న పర్యాటకులు ● చివరిదశలో వసతిగృహ నిర్మాణాలు ● పర్యాటకులకు రుచికరమైన ఆహారం ● ఇప్పటికే 26మంది మహిళలకు శిక్షణ ● సుమారు 60కుటుంబాలకు ఉపాధి

తిర్యాణి: వానాకాలంలో జిల్లాలోని మారుమూల మండలమైన తిర్యాణిలో ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. చుట్టూ పెద్దపెద్ద గుట్టల నుంచి కిందికి పాల నురగలా జాలువారే జలపాతాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. మండలంలోని చింతలమాదర, గుండాల, ఉల్లిపిట్ట జలపాతాలుండగా జూన్‌ చివరి వారం నుంచి సెప్టెంబర్‌ రెండోవారం వరకు పర్యాటకుల రద్దీ భారీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో గుండాల జలపాతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఎకో టూరిజం ద్వారా ‘హైదరాబాద్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ సొసైటీ (గ్రాండ్‌ ఫార్మా) అనే స్వచ్ఛంద సంస్థ ముందుకువచ్చి సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి చేస్తోంది. గుండాల జలపాతం వద్ద దాదాపు వంద అడుగుల ఎత్తు నుంచి నీళ్లు కిందికి దూకుతుండగా దీనిని బాహుబలి జలపాతంగా కూడా పిలుస్తుంటారు.

పర్యాటకులకు బర్డ్‌వాక్‌ సౌకర్యం

దూర ప్రాంతాల నుంచి జలపాతం సందర్శనకు వచ్చే పర్యాటకులు రెండోరోజు ఉదయం సమీప అటవీ ప్రాంతంలో గైడ్స్‌తో కలిసి బర్డ్‌వాక్‌ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రాదాయాలు, వారు దేవుళ్లను పూజించే విధానం, వారు తినే ఆహార పదార్ధాలు, అడవుల్లో దొరికే ఔషధ మొక్కలపై అవగాహన కల్పించనున్నారు. ఇందుకు దాదాపు మూడు కిలోమీటర్ల పాటు అడవిలో ప్రయాణించాల్సి ఉంటుంది. త్వరలోనే సఫారీ వాహనం ద్వారా అడవిలో పర్యటించేందుకు అవసరమైన ఏర్పాటు చేస్తున్నట్లు స్వచ్చంధ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

అన్నీ బాగున్నా.. సరైన రోడ్డే లేదు

టూరిజం దిశగా అభివృద్ధి బాగానే ఉన్నా పర్యాట కులు వచ్చేందుకు గుండాల గ్రామానికి సరైన రోడ్డు లేదు. ఈ గ్రామానికి రావాలంటే తిర్యాణి మండల కేంద్రానికి చేరుకుని 10కిలో మీటర్ల దూరంలోని రొంపెల్లి వరకు వాహనాల్లో వెళ్లి అక్కడి నుంచి దాదాపు ఆరు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. అలాగే, మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం నుంచి కూడా వయా ఉట్ల గ్రామం మీదుగా జలపాతానికి చేరుకోవచ్చు. కానీ, ఈ రోడ్డు కూడా అధ్వానంగా ఉండడంతో ద్విచక్ర వాహనాలపై అతికష్టంగా వెళ్లాల్సి ఉంటుంది. కాగా, దండేపల్లి నుంచి గుండాల వరకు దాదాపు 12కిలో మీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే రూ.25కోట్లు మంజూరు చేసినప్పటికీ పనులు ఇంకా ప్రారంభించలేదు. తిర్యాణి మండలంలోని రొంపెల్లి నుంచి గుండాలకు, దండేపల్లి నుంచి గుండాలకు రోడ్డు సౌకర్యం కల్పించి పర్యాటక అభివృద్ధికి కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement