గుండాలకు వచ్చి వసతిగృహాల్లో బస చేసే పర్యాటకులకు కావాల్సిన ఆహార పదార్థాల తయారీతోపాటు వివిధ అంశాలపై హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ (నీతం) అనే సంస్థతో సెర్ప్ సహకారంతో 15రోజుల పాటు గుండాల, మంగి గ్రామాల్లోని 18–60 ఏళ్ల మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అంతకుముందు గుండాల గ్రామంలోని మరో 10మంది యువకులకు టూరిస్టులను ఎలా గైడ్ చేయాలనే అంశపై కూడా ట్రైనింగ్ ఇచ్చారు. పర్యాటకుల వసతి కోసం ఆదివాసీ ఇళ్లను తలిపించేలా ఏడు గృహాలతో పాటు కిచెన్, హాల్ నిర్మాణం చేపట్టారు. కాగా, పర్యాటకుల నుంచి వసూలు చేసిన రుసుం నుంచి శిక్షణ పొందిన సిబ్బందికి వేతనాలు అందించడంతో పాటు మిగతా డబ్బులను ఇప్పటికే ఏర్పాటు చేసిన విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ బ్యాంక్ ఖాతాలో జమ చేసి గ్రామావసరాల కోసం వినియోగించనున్నారు. తద్వారా 30 కుటుంబాలకు ప్రత్యక్షంగా, దుకాణాల ఏర్పాటు, అడవి ఫలాల అమ్మకం ద్వారా మరో 30కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి లభించనుంది.


