దహెగాం: ఖరీఫ్ సాగుకు పెట్టుబడి డబ్బులు లేక జిల్లాలోని చాలామంది రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించగా ఇప్పటికీ డబ్బులు అందక అవస్థలు పడుతున్నారు. కొనుగోళ్ల సమయంలోనూ తూకం, ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరిగింది. తీరా పంట అమ్ముకుని డబ్బులు పడ్డాయో.. లేదోనని నిత్యం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నిరాశతో వెనుదిరుగుతున్నారు.
14,981 ఎకరాల్లో జొన్న సాగు
జిల్లాలో ఏజెన్సీ మండలాలైన జైనూర్, కెరమెరి, సిర్‌పూర్(యు), లింగాపూర్, నార్నూర్ తదితర మండలాల్లో యాసంగిలో 14,981 ఎకరాల్లో జొన్న సాగు చేశారు. పంట చేతికి రాగానే జైనూర్, కెరమెరి మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం 801 మంది రైతుల నుంచి 26,989 క్వింటాళ్లు కొనుగోలు చేసింది. రూ.9.98 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా నేటికీ ఒక్క పైసా రైతుల ఖాతాల్లో జమ కాలేదు.
9,100 ఎకరాల్లో మొక్కజొన్న..
జిల్లాలో 9,100 ఎకరాల్లో రైతులు మొక్క జొన్న సాగు చేసినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. పంట చేతికందడంతో జైనూర్, కాగజ్‌నగర్, కౌటా ల మండలాల్లో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,508 మంది రైతుల నుంచి 65,466 క్వింటాళ్ల మొక్కజొన్న కోనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి రూ.15.71కోట్లకు రైతుల ఖాతాల్లో రూ.2.83 కోట్లు మాత్రమే జమైనట్లు అధికారులు తెలిపారు. మిగతా రూ.12.88 కోట్లు ఇంకా విడుదల కావాల్సి ఉంది.
23వేల ఎకరాల్లో వరి..
జిల్లాలో పత్తి తరువాతి స్థానంలో వరి సాగవుతోంది. యాసంగిలో 23వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. 69వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, మే లో సొసైటీ, ఐకేపీ ద్వారా జిల్లాలో 40 కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు 14,875 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఇందులో సన్నరకం 1,951 మెట్రిక్ ట న్నులు, దొడ్డు రకం 12,924 మెట్రి క్ టన్నులు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. 1,557 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.19.72 కోట్లు కాగా, 397 మంది రైతుల ఖాతాల్లో రూ.4.77 కోట్లు జమయ్యాయి. ఇంకా 1,160 మంది రైతులకు రూ.14.95 కోట్లు జమ కావాల్సి ఉంది. కొనుగోళ్లు, ధాన్యం తరలింపులో జాప్యం జరిగి రైతులు అకాల వర్షాలకు పంటలను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాము ధాన్యం విక్రయించి రెండు, మూడు వారాలైనా డబ్బులు ఖాతాల్లో జమ కాలేదని రైతులు వాపోతున్నారు. మృగశిర కార్తె ప్రవేశించి ఖరీఫ్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో పెట్టుబడికి చేతిలో డబ్బులు లేక ఆందోళన చెందుతున్నారు.


