తిర్యాణి: ఆదివాసీల్లోని నిరుపేదలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌జీవో ఆధ్వర్యంలో ‘తెలంగాణ సమ్మెళిత జీవనోపాధి’ కార్యక్రమానికి సెర్ప్ ద్వారా శ్రీకారం చుట్టింది. ఇందుకు జిల్లాలోని తిర్యాణి, లింగాపూర్ మండలాలను ఎంపిక చేసింది. తిర్యాణి మండలానికి దాదాపు రూ.4కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఒక్కో లబ్ధిదారుకు దాదాపు రూ.35వేల విలువైన లైవ్‌వుడ్, ఇతర సామగ్రి అందజేయాల్సి ఉంది. మొదటి విడతలో భాగంగా శుక్రవారం మండలంలోని దానాపూర్‌లో ఒక్కో లబ్ధిదారుకు రూ.24,800 విలువైన నాలుగు మేకపిల్లలు పంపిణీ చేశారు. అయితే, సదరు ఎన్‌జీవో సిబ్బంది, విక్రయదారులు కుమ్మకై ్క లబ్ధిదారులను మోసం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దానాపూర్‌లో పంపిణీ చేసిన మేకలు మహారాష్ట్రకు చెందినవి కావడం, అవి చిన్నగా ఉండటంతో వాటి ధర బహిరంగ మార్కెట్‌లో రూ.3వేల నుంచి రూ.4వేల మధ్య ఉంటుందని లబ్ధిదారులు చెబుతున్నారు. కానీ, రూ.6,200 చొప్పున కొనుగోలు చేసినట్లు చెబుతుండడంతో లబ్ధిదారుల్లో అసంతృప్తి నెలకొంది. మహారాష్ట్ర మేకలు జిల్లా వాతావారణాన్ని తట్టుకోవడం సాధ్యం కాదని, స్థానికంగా లభించే మేకలు ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. కాగా, మేకల కొనుగోలులో వెట్నరరీ వైద్యులను భాగస్వాములను చేయకపోవడంతో సదరు సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లు సమాచారం.


