అనధికార దత్తత చట్టరీత్యా నేరం | - | Sakshi
Sakshi News home page

అనధికార దత్తత చట్టరీత్యా నేరం

Jun 11 2026 7:47 AM | Updated on Jun 11 2026 7:47 AM

● కలెక్టర్‌ కె.హరిత

ఆసిఫాబాద్‌అర్బన్‌: పిల్లలు లేని దంపతులు కేంద్ర దత్తత వనరుల ప్రాధికార సంస్థ(సీఏఆర్‌ఏ) మార్గదర్శకాల ప్రకారం దత్తత తీసుకోవాలని, మధ్యవర్తుల ద్వారా, అనధికార దత్తత చట్టరీత్యా నేరమని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. కాగజ్‌నగర్‌ మండలం చింతగూడకు చెందిన దుర్గం లింగయ్య, రేణుక దంపతులకు చట్టబద్ధమైన రిలేటీవ్‌ అడప్షన్‌ ప్రక్రియ పూర్తయినందున జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం మహిళాశిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో అడాప్షన్‌ ఆర్డర్‌ ప్రతిని అందించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతీ చిన్నారికి సురక్షితమైన కుటుంబ వాతావరణంలో పెరిగే హక్కు ఉందని, దత్తత ప్రక్రియ ద్వారా పిల్లలకు ప్రేమ, భద్రత, విద్య, మంచి భవిష్యత్తు కల్పించే అవకాశం ఉందని తెలిపారు. దత్తత ప్రక్రియలో పారదర్శకత, చట్టబద్ధత, పిల్లల సంక్షేమమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధానాలు తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. దత్తత తీసుకోవాలనుకునే దంపతులు మహిళాశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని జిల్లా బాలల సంరక్షణ విభాగాన్ని సంప్రదించాలని కోరారు. సంబంధిత అధికారులు నిబంధనలు, అవసరమైన పత్రాలు, చట్టబద్ధ ప్రక్రియలపై సమాచారం అందించి సహకరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి స్వరూపారాణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేశ్‌, ప్రొటెక్షన్‌ అధికారి శ్రావణ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవాలి

కాగజ్‌నగర్‌టౌన్‌: పట్టణంలోని కాపువాడలో మూతపడిన మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల భవనాన్ని కలెక్టర్‌ కె.హరిత, విద్యాశాఖ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పదేళ్లుగా మూతపడిన ప్రభుత్వ పాఠశాలలో వసతులు కల్పించి తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈవో వాసాల ప్రభాకర్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement