కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా 70 వేలకు పైగా జనాభా ఉంది. ఈ స్థాయిలో జనాభా ఉన్నా అవసరమైన స్థాయిలో పారిశుద్ధ్య సిబ్బంది లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. పారిశుద్ధ్య విభాగంలో 136 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా అందులో కేవలం 20 మంది మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ముగ్గురు జవాన్లు, తొమ్మిది మంది మహిళా కార్మికులు పారిశుద్ధ్య విధులు నిర్వర్తిస్తుండగా ఔటర్ సోర్సింగ్ సిబ్బంది 116 మంది ఉన్నారు. చెత్త సేకరణకు ప్రతిరోజూ నాలుగు ట్రాక్టర్లలో 30 మంది, 12 ఆటో ట్రాలీల్లో 12 మంది చెత్త సేకరణకు వెళ్తున్నారు. మిగిలిన వారిలో 50 మంది మహిళలు వీధులను శుభ్రం చేస్తున్నారు. మరో 24 మందిలో పది మంది కార్యాలయంలోనే వివిధ విభాగాల్లో పని చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతీ 10వేల జనాభాకు కనీసం 29 మంది శానిటేషన్ కార్మికులు ఉండాలి. ఆ లెక్కన పట్టణానికి దాదాపు190 మందికి పైగా అవసరం. కానీ ప్రస్తుతం సిబ్బంది సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగడం లేదు. కొన్ని కాలనీల్లో చెత్త సేకరణ ఆలస్యమవుతుండగా, మరిన్ని ప్రాంతాల్లో డ్రెయినేజీలు శుభ్రం కాక నెలల తరబడి పూడిక పేరుకుపోయింది.
పేరుకుపోయిన పూడిక
పట్టణంలోని పలు సంజీవయ్య కాలనీ, ఇర్ఫాన్‌నగర్, కాపువాడ, ఓల్డ్ కాలనీ, ద్వారకానగర్, బాలాజీనగర్, కౌసర్‌నగర్ లోతట్టు ప్రాంతాల్లో డ్రైయినేజీల్లో పూడిక పేరుకుపోయింది. చాలాచోట్ల మురుగునీటి కాలువల్లో చెత్తా చెదారం, ప్లాస్టిక్ వర్థ్యాల కారణంగా నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతోంది. భారీ వర్షాలు కురిస్తే కాలనీల్లోకి నీరు చేరే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


