అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

May 21 2026 12:14 AM | Updated on May 21 2026 12:14 AM

జూన్‌ 2న ముఖ్యమంత్రి చేతుల మీదుగా సామూహిక ప్రారంభోత్సవం

జిల్లా నుంచే రెండో విడత పంపిణీ షురూ

రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

మంత్రి ‘జూపల్లి’తో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన

ఆసిఫాబాద్‌/కెరమెరి/కాగజ్‌నగర్‌టౌన్‌: అర్హులంద రికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జూన్‌ 2న జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్న నేపథ్యంలో బుధవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఏర్పాట్లను పరిశీలించా రు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మధ్యాహ్నం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. హెలి ప్యాడ్‌ వద్ద ఎమ్మెల్సీ దండె విఠల్‌, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌, ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ కె.హరిత, మంచిర్యాల కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, ఎస్పీ నితి క పంత్‌, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కాంగ్రెస్‌ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. కలెక్టరేట్‌లో భోజనం చేసిన అనంతరం వారు కెరమెరి మండలం కొఠారి, కాగజ్‌నగర్‌ మండలం వంజిరీలో పూర్తయిన తొలివిడత ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. సీఎం సభాస్థలి కోసం కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌, కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం క్రీడామైదానం, డాడానగర్‌లోని ఏరోడ్రమ్‌ ప్రాంతాలను పరిశీలించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2న సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా జిల్లాలో సామూహిక ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం పండుగ జరుపుకోనున్నట్లు తెలిపారు. రెండో విడతను జిల్లా నుంచే ప్రారంభిస్తామన్నారు. కొఠారి గ్రామంలో ఆదివాసీ గిరిజన బిడ్డలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టి, వారి కష్టాలు తొలగించిందన్నారు. ప్రభుత్వం మహిళలకు మొదటి ప్రాధాన్యతనిస్తూ మహాలక్ష్మి, గృహజ్యోతి, రేషన్‌కార్డులు, ఇందిర మహిళా శక్తి, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. మహిళను ఇంటి పెద్దగా గుర్తించి సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ వైద్యకళాశాల, నర్సింగ్‌ కళాశాలల ద్వారా ప్రజలకు వైద్యం మరింత చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో ఎస్పీ నితిక పంత్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద భారీ బందోబస్తు చేపట్టారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌, ఏఎంసీ చైర్‌పర్సన్‌ ఇరుకుల మంగ, గ్రంథాలయ జిల్లా చైర్మన్‌ అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

అక్రిడిటేషన్‌ కార్డుల పంపిణీ

2026– 28 సంవత్సరానికి ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా వర్కింగ్‌ జర్నలిస్టులకు కలెక్టర్‌ హరిత, డీపీఆర్వో సంపత్‌కుమార్‌తో కలిసి రాష్ట్ర పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రిడిటేషన్‌ కార్డులు పంపిణీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement