కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా, 70 వేల వరకు జనాభా ఉంటుంది. నియోజకవర్గంలోని బెజ్జూర్, సిర్పూర్–టి, కౌటాల, చింతలమానెపల్లి, దహెగాం మండలాల నుంచి నిత్యం ప్రజలు వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వస్తుంటారు. గతంలో మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రయాణ ప్రాంగణం, రద్దీ ప్రాంతాలు, మార్కెట్ ఏరియాల్లో చలివేద్రాలు ఏర్పాటు చేసేవారు. ఈసారి బస్టాండ్, రైల్వేస్టేషన్, మార్కెట్ ఏరియా, ప్రధాన కూడళ్లలో కనీసం ఒక్క చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రధానంగా మార్కెట్ ఏరియాల్లో మార్వాడీ యువమంచ్, సిర్పూర్ పేపర్ మిల్లు, వ్యాపార సముదాయాలు, కుల సంఘాలు, యువ సంఘాల ఆధ్వర్యంలో ఏటా శ్రీరామనవమి నుంచే చలివేంద్రాలను ఏర్పాటు చేస్తుండేవారు. వేసవి వచ్చిందంటే ఆయా ప్రాంతాలు సందడిగా ఉండేవి. ప్రస్తుతం ఎక్కడా లేవు. బాటిళ్లు కొనే స్థోమత లేని పేదలు, యాచకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


