కొనుగోలు కేంద్రాల్లోనే పేరుకుపోతున్న వరిధాన్యం మిల్లుల్లో ఆలస్యమవుతున్న అన్‌లోడింగ్ అకాల వర్షాల ముప్పుతో అన్నదాతల్లో ఆందోళన
దహెగాం: యాసంగి సీజన్ వరి కోతలు గత నెలలోనే పూర్తయ్యాయి. ధాన్యం రైతుల చేతికొచ్చినా నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల మొదట వారంలోనే ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. అయితే కొనుగోళ్లలో జాప్యం అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ధాన్యం తూర్పారా పట్టి తూకం వేసి నాలుగైదు రోజులు గడిచినా మిల్లులకు తరలించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా కేంద్రాల్లోనే వడ్లకుప్పలు పేరుకుపోతున్నాయి.
23 వేల ఎకరాల్లో వరి
జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్‌లో 23,000 ఎకరాల్లో వరి సాగైంది. అధికంగా దొడ్డు రకం సాగుకే అన్నదాతలు మొగ్గు చూపారు. గతేడాది యాసంగిలో సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ రాకపోవడంతో ఈసారి దొడ్డురకం సాగు చేశారు. సుమారు 69 వేల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం పెట్టుకున్నారు. జిల్లావ్యాప్తంగా 40 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొనుగోళ్లు ప్రారంభమైనా జాప్యంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. శనివారం కలెక్టర్ కె.హరిత దహెగాం మండల కేంద్రంలోని కేంద్రాన్ని సందర్శించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సందర్శన సమయంలో తూకం వేసి నింపి ఉన్న బస్తాలు సైతం నేటికీ లోడ్ చేయకపోవడం గమనార్హం.
సేకరణ నామమాత్రం..
జిల్లాలోని మొత్తం 40 కొనుగోలు కేంద్రాల్లో సొసైటీ ఆధ్వర్యంలో 19, ఐకేపీ ఆధ్వర్యంలో 21 కేంద్రాలు నిర్వహిస్తున్నారు. సుమారు 69 వేల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం పెట్టుకోగా ఇప్పటివరకు కేవలం 2,389 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఆయా కేంద్రాల్లో దొడ్డురకం 2,209 టన్నులు, సన్నరకం వడ్లు 180 టన్నులు కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో నాలుగు బాయిల్డ్ రైస్ మిల్లులకు వడ్లు అలాట్ చేశారు. కాగజ్‌నగర్‌లో 2, సిర్పూర్(టి) 1, వేంపల్లి 1 రైస్ మిల్లులకు ధాన్యం తరలిస్తున్నారు. మిల్లుల్లో ఎండల తీవ్రతతో లారీల నుంచి ధాన్యం అన్‌లోడ్ చేయడానికి హమాలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. అకాల వర్షాల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.
మొత్తం
కొనుగోలు కేంద్రాలు 40
జిల్లా వివరాలు
దొడ్డురకం వడ్లు 2,209 టన్నులు
సన్నరకం వడ్లు 180 టన్నులు
ఇప్పటివరకు
కొనుగోళ్లు 2,389 టన్నులు


