ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని పురాతనమైన అంకమరాజు, వీరంజనేయస్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకున్నందున ప్రజల సహకారంతో పునర్నిర్మాణం చేపడుతామని ఎమ్మెల్యే కోవ లక్ష్మి తెలిపారు. ఆలయ ఆవరణలో మంగళవారం అంకమరాజు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దేవాలయ భూమి సాధన, ఆలయ నిర్మాణం కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వందల ఏళ్ల క్రితం నాటి జనగామ(ప్రస్తుత ఆసిఫాబాద్)ను రాజధానిగా చేసుకుని గోండ్వాన రాజ్యంగా పరిపాలన సాగిందని తెలిపారు. నూతన ఆలయ నిర్మాణ నిధుల సేకరణ కోసం వ్యాపారులు, రాజకీయ నాయకులు, కుల సంఘాలతో కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్ మాట్లాడుతూ ఆలయ నిర్మాణం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సమావేశంలో ఆలయ పూజారి ఆత్రం పాండుపటేల్, అర్చకులు విజయ్‌కుమార్‌శర్మ, మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వివిధ సంఘాల సభ్యులు, నాయకులు రేగుంట కేశవ్‌రావు, అర్జు మాస్టర్, బానోత్ గోపాల్‌నాయక్, మర్సుకోల సరస్వతి, తిరుమల, వినోద్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.


