పేదలకు ‘బెస్ట్‌’ ఆప్షన్‌ | - | Sakshi
Sakshi News home page

పేదలకు ‘బెస్ట్‌’ ఆప్షన్‌

May 20 2026 12:05 AM | Updated on May 20 2026 12:05 AM

● బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లలో ఎస్సీ విద్యార్థులకు ప్రవేశాలు ● జూన్‌ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ ● లక్కీడ్రా పద్ధతిలో ఎంపిక ● జిల్లాకు చెందిన షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన వారు మాత్రమే అర్హులు. కుటుంబంలో ఒక్కరికే అవకాశం కల్పిస్తారు. ● ఒకటో తరగతిలో ప్రవేశానికి 01– 06– 2020 నుంచి 31– 05– 2021 మధ్య జన్మించి ఉండాలి. జూన్‌ 1 నాటికి వారి వయస్సు 5– 6 ఏళ్లు ఉండాలి. ● 2025– 26 విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఐదో తరగతిలో ప్రవేశానికి అర్హులు. ● గ్రామీణ ప్రాంతాల వారికి వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతంలో అయితే రూ.2 లక్షల వరకు ఉండాలి. మీసేవ ద్వారా ఏప్రిల్‌ 1 తర్వాత ఆదాయ ధ్రువపత్రం పొందాలి. ● మీసేవ ద్వారా జారీ చేసిన జనన, కులం, నివాస ధ్రువపత్రాలు సమర్పించాలి. ● ఆధార్‌ కార్డు, రేషన్‌కార్డు, నాలుగో తరగతి ఉత్తీర్ణత మార్కుల జాబితా, బోనఫైడ్‌, మూడు కలర్‌ పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు జతచేయాలి.

కౌటాల: ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందుకోసం జిల్లాలో రెండు ప్రైవేట్‌ పాఠశాలలను ఎంపిక చేయగా, రెసిడెన్షియల్‌, నాన్‌ రెసిడెన్షియల్‌ సౌకర్యాలతో ఉచిత విద్య అందిస్తారు. 1 నుంచి పదో తరగతి వరకూ బోధిస్తారు. నిర్వహణ కోసం ప్రభుత్వం ఏటా ఆయా పాఠశాలల యాజమాన్యాలకు నిధులు విడుదల చేస్తోంది. ప్రవేశాల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ప్రైవేట్‌ బడుల్లో ఉచిత విద్య

కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యను పేదలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో 2026– 27 విద్యా సంవత్సరానికి జిల్లాలోని రెండు ప్రైవేట్‌ పాఠశాలలను బెస్ట్‌ అవైలబుల్‌ పథకంలో ఎంపిక చేశారు. కాగజ్‌నగర్‌ పట్టణంలోని విశ్వశాంతి హైస్కూల్‌, కౌటాలలోని మయూరి విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 5వ తరగతిలో రెసిడెన్షియల్‌ ప్రవేశాలకు 40 సీట్లు, ఒకటో తరగతిలో నాన్‌ రెసిడెన్షియల్‌ ప్రవేశం కోసం 38 సీట్లు కేటాయించారు. 4వ తరగతి పాసైన విద్యార్థులు ఐదో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తులు చేసుకోవాలి. వీరిలో ఎస్సీ విద్యార్థులకు రెసిడెన్షియల్‌తో పాటు డే స్కాలర్స్‌గానూ అవకాశం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం నుంచి ఒక్కో విద్యార్థికి రూ.42 వేల చొప్పున యాజమాన్యాలకు అందిస్తుంది. అదే డే స్కాలర్‌ విద్యార్థి కోసం రూ.28 వేలు చెల్లిస్తారు.

సీట్ల కేటాయింపు ఇలా..

జిల్లా కేంద్రంలోని జిల్లా షెడ్యూల్డ్‌ కులాలు అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తు ఫారం తీసుకోవాలి. అన్ని ధ్రువీకరణ పత్రాలను జతచేసి జూన్‌ 6లోగా జిల్లా ఎస్సీ కార్యాలయంలో సమర్పించాలి. అనంతరం కలెక్టరేట్‌లో లక్కీడ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక చేస్తారు. ఇతర వివరాలకు జిల్లా ఎస్సీ కార్యాలయంతో పాటు బెస్ట్‌ అవైలబుల్‌ పథకంలో ఎన్నికై న పాఠశాలల్లో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే మరింత మంది విద్యార్థులకు విద్యాఅవకాశాలు కల్పించేందుకు మరికొన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో బెస్ట్‌ అవైలబుల్‌ పథకం కింద ఎంపిక చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

అర్హతలు.. కావాల్సిన పత్రాలివే..

దరఖాస్తు చేసుకోవాలి

జిల్లాలోని బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో ఒకటి, ఐదో తరగతిలో ప్రవేశాల కోసం ఎస్సీ విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి. జూన్‌ 6లోగా దరఖాస్తులు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలి. కలెక్టర్‌ సమక్షంలో లక్కీడ్రా నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తాం. వివరాలకు 96520 00987, 63096 74769 నంబర్లలో సంప్రదించాలి.

– అశోక్‌, జిల్లా షెడ్యూల్డ్‌

కులాల అభివృద్ధి శాఖ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement