కాగజ్‌నగర్‌టౌన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు మెరుగుపర్చాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. కాగజ్‌నగర్‌లోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో భారత్ డైనమిక్ లిమిటెడ్, హైదరాబాద్, బీఎస్‌ఎస్‌ఎఫ్ సంయుక్తంగా విరాళంగా అందించిన బెడ్లు, స్ట్రెచర్లు, ఎక్స్‌రే మిషన్లు, వార్మర్లు, సీబీపీ వంటి అత్యాధునిక పరికరాలను మంగళవారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతానికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతీరోజు 200 పైగా ఓపీ వస్తుందని, ప్రసవాలు పెరుగుతున్నాయని తెలిపారు. వైద్యసిబ్బంది అందుబాటులో ఉండి సేవలందించడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సీతారాం, బీడీఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ పి.శ్రీనివాస్‌రావు, బీఎస్‌ఎస్‌ఎఫ్ జనరల్ సెక్రెటరీ ఎ.రామకృష్ణ, ట్రస్టు సభ్యులు డి.బాలసాయి, కై లాష్, సూపరింటెండెంట్ అవినాష్ పాల్గొన్నారు.
దినసరి కూలీల వేతనం 20శాతం పెంపు
ఆసిఫాబాద్: అసంఘటిత రంగ తాత్కాలిక కార్మికులు, దినసరి కూలీలకు దినసరి వేతనం 20శాతం పెంచినట్లు కలెక్టర్ హరిత తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం దినసరి కూలీల వేతనం పెంపుపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గతంలో 2022– 23 ఆర్థిక సంవత్సరంలో దినసరి కూలీల వేతనం పెంచారని, 2026–27 ఆర్థిక సంవత్సరానికి 20 శాతం పెంచుతూ కమిటీ తీర్మానం చేసిందని పేర్కొన్నారు. సమావేశంలో సహాయ కార్మిక అధికారి క్రాంతి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకంగా ఖాళీల భర్తీ
జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రంలో పొరుగు సేవల పోస్టుల భర్తీ పారదర్శకంగా చేపట్టినట్లు కలెక్టర్ కె.హరిత తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. సెంటర్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుకు 8, న్యాయ సలహాదారు కు 4, కేస్ వర్కర్ 6, ఐటీ అసిస్టెంట్ అకౌంటెంట్ పోస్టుకు ఆరు దరఖాస్తులు వచ్చాయన్నారు. మల్టీపర్పస్ పోస్టుకు 47 దరఖాస్తులు రాగా 32 మంది హాజరయ్యారని తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి స్వరూపారాణి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


