‘పోడు’ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం | - | Sakshi
Sakshi News home page

‘పోడు’ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం

May 20 2026 12:05 AM | Updated on May 20 2026 12:05 AM

● రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు శంకర్‌ ● ఖర్జెల్లిలో రైతులతో సమావేశం

చింతలమానెపల్లి: పోడు భూముల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కమిషన్‌ సభ్యుడు జిల్లా శంకర్‌ అన్నారు. చింతలమానెపల్లి మండలం ఖర్జెల్లి గ్రామంలో మంగళవారం కమిషన్‌ సభ్యులు రేణిగుంట ప్రవీణ్‌, నీలాదేవి, రాంబాబు నాయక్‌తో కలిసి పోడు రైతులతో సమావేశమయ్యారు. తహసీల్దార్‌ గెడం ప్రకాశ్‌, ఎఫ్‌డీవో అప్పయ్య, సర్పంచ్‌ చౌదరి నారాయణలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పోడు రైతులు మాట్లాడుతూ 40ఏళ్లకు పైగా భూములు సాగు చేసుకుంటున్నామని, ఇప్పుడు అటవీ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషన్‌ సభ్యుడు జిల్లా శంకర్‌ మాట్లాడుతూ సుమారుగా 50 షెడ్యూల్డ్‌ కుటుంబాలు ఇక్కడ 2 నుంచి 3 ఎకరాల చొప్పున సాగు చేస్తూ జీవిస్తున్నారని, వీరి సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆర్టికల్‌ 21 ప్రకారం ప్రజలకు జీవించే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి, రాష్ట్ర అధికారులతో మాట్లాడతామని తెలిపారు. అటవీ అధికారులు దిందా, ఖర్జెల్లి గ్రామాల పరిధిలో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తమకు నివేదిక అందించారన్నారు. ఇది వ్యక్తులతో ఒప్పందమా, ప్రజలందరితో ఒప్పందమా.. అనేది విచారణ నిర్వహిస్తామన్నారు. ప్రజలతో అవగాహన వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, కందకాల తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశించారు. అటవీ అధికారులు, ప్రజలు సంయమనం పాటించాలన్నారు. పోడు సమస్యపై త్వరితగతిన పరిశీలించి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి అశోక్‌, ఎఫ్‌ఆర్‌వో సుభాష్‌, డిప్యూటీ తహసీల్దార్‌ దౌలత్‌, ఖర్జెల్లి, దిందా, గూడెం, పాపన్‌పేట్‌ గ్రామాల పోడు రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement