భూముల స్వాధీనానికి అటవీశాఖ చర్యలు రైతులు, అధికారుల మధ్య కుదరని సయోధ్య నేడు ఖర్జెల్లిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడి విచారణ
చింతలమానెపల్లి: జిల్లాలో పోడు ఘర్షణలు సద్దుమణగడం లేదు. స్థానికులకు వ్యవసాయమే ప్రధాన ఆధారం కావడంతో ఏటా పోడు సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన విధానం లేకపోవడంతో అటవీ అధికారులు, రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. గిరిజనేతరులు సైతం సాగులో ఉండటంతో వివాదం మరింత రాజుకుంటోంది. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను అధికారులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా, జీవనాధారం కోల్పోయి రోడ్డున పడతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చింతలమానెపల్లి మండలం ఖర్జెల్లిలో పోడు సమస్యపై స్థానిక రైతుల ఫిర్యాదు మేరకు మంగళవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు జిల్లాకు రానుండటంతో వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
కుదరని ఒప్పందాలు
జిల్లావ్యాప్తంగా 2,437 చదరపు కిలోమీటర్ల మేర అడవులు ఉన్నాయి. ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలోని కెరమెరి, సిర్పూర్(యు), లింగాపూర్, తిర్యాణి, కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని సిర్పూర్(టి), కాగజ్‌నగర్, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్‌పేట్ మండలాల్లో పోడు భూముల వివాదాలు ఎక్కువగా ఉన్నాయి. సిర్పూర్(టి) మండలంలోని ఇటికలపహాడ్, చింతలమానెపల్లి మండలంలోని డబ్బా, దిందా, గూడెం, ఖర్జెల్లి గ్రామాల్లో పోడు భూముల స్వాధీనానికి ఇటీవల అటవీ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఒప్పందాలు కుదరడం లేదు.
తరచూ వివాదాలు.. ప్రజాప్రతినిధుల పోరాటాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అటవీహక్కుల చట్టం –2005 ప్రకారం గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేశారు. ఆ తర్వాత 2021లో దరఖాస్తులు స్వీకరించి జీవో 140 ప్రకారం హక్కుదారులను ఎంపిక చేశారు. 2023 జూన్ 30న జిల్లా నుంచే పోడు పట్టాల పంపిణీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అయినా జిల్లాలో పోడు భూముల కోసం వివాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. కాగజ్‌నగర్ మండలం సార్సాల వద్ద జరిగిన పోడు రైతులకు అండగా నిలిచిన అప్పటి జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావుపై కేసు నమోదైంది. పెంచికల్‌పేట్ మండలం కొండపల్లి వద్ద పోరాటం చేసిన తాజా ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు సహా నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చింతలమానెపల్లి మండలంలోని గంగాపూర్ శివారులో బాలాజీఅనుకోడ గ్రామానికి చెందిన రైతు రాజలింగు అటవీ అధికారుల తీరును నిరసిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇదే మండలంలోని ఖర్జెల్లి, దిందా గ్రామం శివారులో కందకాల తవ్వకాలను చేపట్టగా రైతులు అడ్డుకున్నారు.
నేడు జిల్లాకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడి రాక
ఆసిఫాబాద్‌అర్బన్: రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు కమిషన్ సభ్యుడు శంకర్ మంగళవారం జిల్లాకు రానున్నారని కలెక్టర్ కె.హరిత ఒక ప్రకటనలో తెలిపారు. చింతలమానెపల్లి మండలం ఖర్జెల్లి పంచాయతీ పరిధిలో ఏళ్లుగా సాగు చేసుకుటున్న పోడు భూముల్లో పంటలను అటవీశాఖ అధికారులు ధ్వంసం చేసి భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 50 షెడ్యూల్డ్ కులాల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారని, అటవీ అధికారులు పంట ధ్వంసం చేయడమే కాకుండా కేసులు నమోదు చేస్తున్నట్లు బాధితులు దరఖాస్తులో పేర్కొన్నారని తెలిపారు.


