చింతలమానెపల్లి: తాజా ప్రభుత్వ పాలనలో పోడు రైతులను నట్టేటా ముంచుతున్నారని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప విమర్శించారు. మండల కేంద్రంలో సోమవారం గంగాపూర్, ఖర్జెల్లి, గూడెం, దిందా గ్రామాల పోడు రైతులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. పలువురు రైతులు తమ భూములను అటవీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారని కంటతడి పెట్టారు. కోనప్ప మాట్లాడుతూ ఇతర పార్టీల నాయకులు చెప్పిన మాయమాటలు నమ్మి బీఆర్‌ఎస్ పార్టీని గెలిపించకుండా రైతులు మోసపోయారని అన్నారు. తాను ఒక గుంట భూమిని పోనివ్వలేదని పేర్కొన్నారు. గ్రామాల్లో భూముల స్వాధీనానికి ప్రజలను వర్గాలుగా విడగొడుతున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు మభ్యపెట్టే మాటలు చెప్పారని, పోడు భూములు స్వాధీ నం చేసుకుంటుంటే మొహం చాటేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సర్పంచులు దోసంగుల సత్తమ్మ, కుడుమెత సురేష్, బీఆర్‌ఎస్ నాయకులు కొంగ సత్యనారాయణ. నక్క మనోహర్, నాజిం హుస్సేన్, డోకె రాజన్న, అజీమ్ హుస్సేన్, డోకె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


