ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ గోడు వెల్లబోసుకున్నారు. అధికారులు వినతులు అందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్(రెవెన్యూ) ఎం.డేవిడ్ మాట్లాడుతూ అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలన్నారు. డీఆర్‌వో దాసరి వేణుతో కలిసి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. క్రాస్‌రోడ్డు వద్ద డ్రెయినేజీ నిర్మించాలని రెబ్బెన మండల కేంద్రానికి చెందిన ఎలుములె జ్ఞానేశ్వర్ దరఖాస్తు అందించాడు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు అటవీ అనుమతులు ఇప్పించాలని లింగాపూర్ మండలం మోతీపటార్ గ్రామానికి చెందిన జాదవ్ లలిత కోరారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రెబ్బెన మండలం గోలేటికి చెందిన కట్ట రజిత, జైనూర్ మండలం దబోలికి చెందిన కొడప మీరాబాయి వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. ఫ్రీడమ్ ఫైటర్ సర్టిఫికెట్ మంజూరు చేయాలని జిల్లా కేంద్రానికి చెందిన ఎండీ జమీల్ హుస్సేన్ అధికారులకు విన్నవించాడు.
కొడుకు పట్టించుకుంటలేడు
తిర్యాణి గ్రామ శివారులో సర్వే నం.19/16/అ/3లో వ్యవసాయ భూమి ఉంది. నాకు, నా భర్త అంత్యక్రియల ఖర్చులు భరించాలనే ఒప్పందంతో పెద్ద కుమారుడి పేరుపై ఆ భూమిని పట్టా చేయించా. నా భర్త గత నెల 24న మరణించినా అంత్యక్రియల కార్యక్రమానికి సాయం అందించలేదు. కొడుకు కనీసం పట్టుంచుకోలేదు. తిరిగి ఆ భూమిని నా పేరుపై పట్టా చేయించాలి.
– వీరమ్మ, తిర్యాణి


