కాగజ్‌నగర్ మండలంలోని కోయవాగు గ్రామానికి చెందిన మేకర్తి పెంటయ్య (55) కాగజ్‌నగర్ మార్కెట్‌లో హమాలీ కార్మికుడిగా పని చేస్తున్నాడు. గత నెల 30న ఎండలోనే పని చేసి సాయంత్రం ఇంటికి వచ్చాడు. అలసటగా ఉందని చెప్పి నీరు తాగి పడుకున్నాడు. కొద్దిసేపటికి అపస్మాకరస్థితికి చేరుకోగా వెంటనే కుటుంబీకులు 108కు సమాచారం ఇచ్చారు. కాగా, పెంటయ్య వడదెబ్బతో మృతి చెందినట్లు 108 సిబ్బంది నిర్ధారించారు.
కౌటాల మండల కేంద్రంలోని మార్కెట్ కాలనీకి చెందిన దివిటి తిరుపతి (45) పాత ఇనుప సామగ్రి కొనుగోలు, విక్రయాలతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజులాగే ఈ నెల 4న ఎండలో పాత ఇనుప సామగ్రి కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. అస్వస్థతకు గురై ఇంటికి వచ్చాడు. వాంతులు, విరోచనాలు చేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు కౌటాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కౌటాల: జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండలకు తోడు వేడి గాలులు వీస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్నాయి. గాలిలో తేమ తగ్గిపోతోంది. ఉద యం 7గంటల నుంచి మొదలవుతున్న వేడి సెగలు రాత్రి ఏడైనా తగ్గడం లేదు. చిన్నారులు, గర్భిణులు, పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే వడదెబ్బతో పలువురు మృతి చెందా రు. ఎండలు మండిపోతుండడంతో వాగులు, చెరువులు ఎండిపోతున్నాయి. మూగ జీవాలు దాహంతో అల్లాడుతున్నాయి. జిల్లాలో ఈసారి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. వారంపాటు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉండే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.
సాయం సరే.. నిర్ధారణేది?
వడగాలులను రాష్ట్ర ప్రత్యేక విపత్తుగా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. వడగాలుల ప్రభావంతో లేదా వడదెబ్బతో ఎవరైనా మరణిస్తే.. బాధిత కు టుంబానికి రూ.4లక్షల పరిహారం ఇవ్వనుంది. అ యితే వడదెబ్బ మృతులను నిర్ధారించడంలో అధి కారులు అలస్వతం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు న్నాయి. వడదెబ్బతో ఎవరైనా మృతి చెందితే వెంటనే తహసీల్దార్, ఎస్సై, స్థానిక ప్రభుత్వ వైద్యుడితో కూడిన త్రిసభ్య కమిటీ దానిని నిర్ధారించి కలెక్టర్, జిల్లా వైద్యాధికారికి నివేదిక పంపించాల్సి ఉంటుంది. కాగా, అధికారులు మధ్య సమన్వయం లేక ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతుండడంతో బాధి త కుటుంబాలకు సాయం అందడం లేదు.
ఇటీవలి వడదెబ్బ మరణాలు
నిర్మానుష్యంగా కౌటాల–బెజ్జూర్ ప్రధాన రహదారి
ఐదురోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
సామ్యానుడిపై సెగ..
ఎండ వేడిమి తట్టుకోలేక జనం ఇళ్లకే పరిమి తమవుతున్నారు. కూలర్లు, ఏసీలకు అతుక్కుపోతున్నారు. మధ్యాహ్నం వేళ జిల్లా కేంద్రంతోపాటు కాగజ్‌నగర్, కౌటాల ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. నిత్యం జనంతో రద్దీగా ఉండే జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్, కాగజ్‌నగర్, కౌ టాల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఒక్కరోజు ఇంటి వద్ద ఉంటే పూట గడవని దినసరి కూలీల బాధలు వర్ణనాతీతం. తప్పనిసరి పరిస్థితుల్లో పనులకు వెళ్తూ సన్‌స్ట్రోక్ బారిన పడుతున్నారు.
ఎండలో తిరగొద్దు
పెరిగిన ఎండల దృష్ట్యా తప్పనిసరైతేనే గొడుగు, టోపీ ధరించి బయటకు వెళ్లాలి. పిల్లలు, వృద్ధులు, మహిళలు బయటకు వెళ్లకపోవడమే మంచింది. చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రతలు పెరగడం, వణుకు పుట్టడం, వాంతులు చేసుకోవడం లాంటివి వడదెబ్బ లక్షణాలు. వడదెబ్బ గురైన వ్యక్తిని చల్లని గాలి తగిలే ప్రదేశానికి చేర్చాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు ద్రావణం లేదా ఓఆర్‌ఎస్ తాగించాలి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాలి. – సీతారాం, డీఎంహెచ్‌వో


