పెద్దవాగులో ఇసుక ‘తోడే’ళ్లు! | - | Sakshi
Sakshi News home page

పెద్దవాగులో ఇసుక ‘తోడే’ళ్లు!

May 18 2026 6:39 AM | Updated on May 18 2026 6:39 AM

● అనుమతి లేకుండా తరలింపు ● ‘ఇందిరమ్మ’ ఇళ్ల పేరిట దందా ● ఆగని ఇసుక అక్రమ రవాణా ● అధికారుల చర్యలు అంతంతే..

చిత్రంలో కనిపిస్తున్న ట్రాక్టర్‌ చేడ్వాయి గ్రామానికి చెందినది. ఈనెల 14న ఉదయం 6గంటలకు ఎలాంటి అనుమతి లేకుండా పెద్ద వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పెంచికల్‌పేట్‌ ఎస్సై అనిల్‌కుమార్‌ పట్టుకున్నారు. ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి యజమానిపై కేసు నమోదు చేశారు.

పెంచికల్‌పేట్‌: జిల్లాలో ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమార్కులు నదులు, వాగులు, ఒర్రెల నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుకను తోడేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లే కున్నా పెద్ద ఎత్తున యంత్రాలను ఉపయోగిస్తున్నా రు. గ్రామీణ ప్రాంతాల్లోని వాగుల నుంచి ఇసుకను పగలు డంప్‌ చేస్తూ రాత్రివేళ ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. అధికారులు అడపాదడపా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తున్నా అక్రమార్కుల తీరులో మార్పు రావడం లేదు. క్షేత్రస్థాయిలో అధికారుల అలసత్వంతో విలువైన ఇసుక ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో..

ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. లబ్ధిదారులకు ఇసుక వాహనంలో డీడీ రూ.143 మాత్రమే వసూలు చేస్తున్నారు. ఇదే అదనుగా భావించిన కొంతమంది ట్రాక్టర్‌ యజమానులు ఇళ్ల నిర్మాణం చేపట్టిన ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి పత్రాలు తీసుకుంటున్నారు. అక్రమంగా పంచాయతీ కార్యదర్శుల వద్ద అప్రూవల్‌ తీసుకుని ప్రైవేట్‌లో ట్రాక్టర్‌ ఇసుకను రూ.1,800 నుంచి రూ.2వేలకు విక్రయిస్తున్నారు. మరోవైపు బ్రిక్స్‌ ప్లాంట్‌ యజమానులు ఒక్కో ప్లాంట్‌ వద్ద పదుల సంఖ్యలో ఇసుక ట్రిప్పులను డంప్‌ చేసి రాత్రివేళ ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. పెంచికల్‌పేట్‌ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నిల్వలున్నా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకుని ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

అక్రమంగా తరలిస్తే చర్యలు

ప్రభుత్వం ఎంపిక చేసిన రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుక తీసుకువెళ్లేందుకు డీడీలు చెల్లించాలి. ఎలాంటి అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా తరలించినా, నిల్వ చేసినా చట్టం ప్రకారం చర్యలు తప్పవు. ఇప్పటికే మండల స్థాయిలో ఇసుక రవాణాకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటాం.

– గంగాధర్‌,

మైనింగ్‌ ఏడీ, కుమురంభీం ఆసిఫాబాద్‌

ఒకటే డీడీ.. పది ట్రిప్పులు

పెంచికల్‌పేట్‌ వద్ద పెద్దవాగు నుంచి ఇసుక అక్రమ రవాణాకు బ్రిక్స్‌ప్లాంట్‌ యజమానులు తెరలేపా రు. నిబంధనల ప్రకారం ‘మన ఇసుక’ వాహనంలో రూ.700 డీడీకి ఒక ట్రిప్పు ఇసుక మాత్రమే పెద్దవాగు నుంచి తరలించాల్సి ఉంది. అక్రమార్కులు ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వ సెలవు దినాలు, రాత్రివేళ ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు. ని బంధనల ప్రకారం పెంచికల్‌పేట్‌ వైపు పెద్ద వాగు నుంచి ఇసుక తరలించాల్సి ఉండగా.. దహెగాం మండలంలోని లగ్గాం నుంచి ఇసుకను పెంచికల్‌పేట్‌ మండలానికి తరలిస్తూ నిబంధనలు అతిక్రమిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయడానికి రెవెన్యూ, పోలీస్‌ అధికారులు ముమ్మరంగా పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ప్రధాన రహదారి వద్ద సిబ్బందిని నియమించడంతో అక్రమార్కుల కన్ను ఎల్లూర్‌ బొక్కివాగుపై పడింది. ప్రతీరోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. డీడీలు చెల్లించి ఇసుక తరలించాల్సి ఉండగా అక్రమ మార్గంలో పరిశ్రమల వద్ద పెద్ద ఎత్తున ఇసుక నిల్వ చేసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement