కెరమెరి మండల కేంద్రానికి చెందిన ఈ మహిళ పేరు పాతాడే భారత్‌బాయి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అభయహస్తం పథకం కింద ఏడాదికి రూ.365 చొప్పున వరుసగా ఐదేళ్లు మొత్తం రూ.1,825 చెల్లించింది. లబ్ధిదారులు ఎంత చెల్లిస్తారో.. ప్రభుత్వం కూడా తన వాటాగా అంతే చెల్లిస్తుంది. ఈ లెక్కన ఐదేళ్లలో రూ.3,650 జమయ్యాయి. ఇప్పటివరకు వడ్డీతో కలిపి ఈమెకు సుమారు రూ.10వేల వరకు ఇవ్వాల్సి ఉండగా తెలంగాణ ప్రభుత్వం విస్మరించింది. ఈ సమస్యలో ఒక్క భారత్‌బాయిదే కాదు.. జిల్లాలో అనేకమంది స్వయం సహాయక సంఘాల మహిళలది.
కెరమెరి: అభయహస్తం డబ్బుల కోసం స్వయం సహాయక సంఘాల మహిళలు ఏళ్లతరబడి నిరీక్షిస్తున్నారు. ఉమ్మడి ప్రభుత్వంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అమలు చేసిన ఈ పథకాన్ని తెలంగాణ ఏర్పాటు తర్వాత వచ్చిన ప్రభుత్వం ఎత్తివేసింది. కనీసం అప్పటివరకు జమ చేసిన బీమా డబ్బులు కూడా ఇవ్వడంలేదు. లబ్ధి దారులకు డబ్బుల చెల్లింపునకు 2022లో వివరాలు సేకరించి ఆన్‌లైన్ చేయాలని అప్పటి ప్రభుత్వం డీ ఆర్‌డీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. జిల్లాలో సుమారు 36,256 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు అభయహస్తం డబ్బులు చెల్లించారు. పథకం ఎత్తివేసి 11 ఏళ్లయినా డబ్బులు తిరిగి చెల్లించడంలో ప్రభుత్వం మీనమేశాలు లెక్కిస్తోంది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఎస్‌హెచ్‌జీ సభ్యులకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు అప్పటి ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకాన్ని తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు తుంగలో తొక్కాయి.
మహిళలకు ఆసరా కల్పించేందుకే..
అభయహస్తం పథకంలో చేరేందుకు 18నుంచి 60ఏళ్లు కలిగిన స్వయం సహాయక సంఘాల సభ్యులు అర్హులుగా నిర్ణయించారు. 55ఏళ్ల లోపు మహిళలు ఏడాదికి రూ.365 చెల్లించారు. 55 ఏళ్లుదాటినవారు ఏడాదికి రూ.500 చొప్పున ఐదేళ్ల పాటు చెల్లిస్తే 60 ఏళ్లు దాటగానే జీవితాంతం నెలకు రూ.500 చెల్లించాల్సి ఉంది. ఎవరైనా సభ్యులు సహజ మరణం పొందితే రూ.35వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.75వేలు, దహస సంస్కారాలకు తక్షణ సహాయంగా రూ.5వేలు చెల్లించేలా పథకాన్ని రూపొందించారు. బీమా ప్రీమియం చెల్లించిన వారి చదువుకునే ఇద్దరి పిల్లలకు ఉపకార వేతనాలు అందజేసే అవకాశం కల్పించారు. 8,9,10 తరగతులతో పాటు ఇంటర్ చదువుకునే విద్యార్థులకు ఏడాదికి రూ.1,200 ఉపకార వేతనాన్ని అందించేలా ప్రణాళికలు తయారు చేశారు.
ఏళ్లు గడుస్తున్నా అంతేనా..
2009 నుంచి 2014 వరకు స్వయం సహాయక సంఘాల మహిళలు చెల్లించిన డబ్బులను వారి ఖాతాల్లో జమ చేస్తామని 2022లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. వివరాలు సేకరించాలని డీఆర్‌డీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారు వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందజేశారు. అభయహస్తం బాండు, బ్యాంక్ ఖాతా పుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్ ప్రతులు, సెల్ నెంబర్ కూడా సేకరించారు. ఈ వివరాలు ఇచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో నమోదు చేశాక డబ్బులను ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రక్రియ గడిచి మూడేళ్లయినా ఇప్పటివరకు ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదు. దాదాపు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 36,256 మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులు అభయహస్తం డబ్బులు కోసం వేచి చూస్తున్నారు. జిల్లాకు రూ.230 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన అప్పటి ప్రభుత్వ హామీ అమలుకు నోచుకోలేదు.
ఎలాంటి ఆదేశాలు రాలేదు
గతంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం లబ్ధిదారుల వివరాలు సేకరించి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం సూచించినట్లు వివరాలతో నివేదిక పంపించాం. అభయహస్తం డబ్బుల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.
– దత్తారావు, డీఆర్డీవో


