వాంకిడి: మండలంలోని బెండార గ్రామంలో శనివా రం డీఎస్పీ అశోక్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 30 మంది పోలీస్ సిబ్బందితో గ్రామంలో తనిఖీలు నిర్వహించి సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తుల సంచారం, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ తదితర ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. నేరాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. గంజాయి విక్రయం, ఇతర అక్రమ కార్యకలాపాల సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలుపాలని కోరారు. సైబర్ మోసాలు, అపరిచిత కాల్స్ లింక్‌లు, ఓటీపీలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చదువు, ఉపాధి, క్రీడల వైపు దృష్టి మళ్లించాలని వివరించారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్‌శాఖ ప్రజలకు ఎల్ల ప్పుడు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం రహదారి భద్రత నిబంధనలపై అవగాహన కల్పించారు. సీఐ వేణుగోపాల్, ఎస్సై మహేందర్, సిబ్బంది పాల్గొన్నారు.


