కాస్త ఊరట! | - | Sakshi
Sakshi News home page

కాస్త ఊరట!

May 16 2026 1:15 AM | Updated on May 16 2026 1:15 AM

పంటల మద్దతు ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాల్‌కు రూ.557, వరికి రూ.72 పెంపు జిల్లాలోని దూది రైతులకు మేలు.. కొనుగోళ్లు సరళతరం చేయాలని వినతి

ఆసిఫాబాద్‌: కేంద్ర ప్రభుత్వం పంటల మద్దతు ధర పెంచడంతో రైతులకు కాస్త ఊరట లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినేట్‌ కమిటీ 2025– 26 సమావేశంలో వానాకాలం నుంచి 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరల పెంపునకు ఆమోదం తెలిపారు. జిల్లా రైతులు పండించిన పలు పంటలకు లాభదాయకమైన ధర లభించనుంది. ముఖ్యంగా జిల్లాలో ప్రధానంగా సాగువుతున్న పత్తి, వరి, మొక్క జొన్న, కందులకు ధర పెరిగింది. అయితే పత్తికి పెంచిన స్థాయిలో వరికి పెంచకపోవడం నిరాశ కలిగిస్తోంది.

జిల్లాలో పంటల సాగు ఇలా..

జిల్లాలో 1.44 లక్షల మంది రైతులు ఉండగా, వానాకాలం సీజన్‌లో సుమారు 4.52 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయి. అటవీ, ఏజెన్సీ ప్రాంతాల్లో చిన్న సన్నకారు రైతులు అధికంగా ఉన్నారు. ఇందులో అత్యధిక విస్తీర్ణంలో 3.70 లక్షల ఎకరాల్లో పత్తిని పండిస్తారు. స్థానికంగా సాగునీటి వనరులు తక్కువగా ఉండటంతో కాటన్‌పైనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. ఆ తర్వాత 47,228 ఎకరాల్లో వరి, 3,017 జొన్న, 7,668 మొక్కజొన్న, 1200 ఎకరాల మిర్చితో కూరగాయలు, ఇతర పంటలు పండిస్తున్నారు. ఇక యాసంగిలో మాత్రం 30 వేల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. గతంతో పోలిస్తే వ్యవసాయ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. విత్తనాలు, ఎరువులు, భూమి కౌలుతో పాటు కూలీల రేట్లు పెరగడం రైతులకు భారంగా మారింది. దుక్కి దున్నడం మొదలు పంట చేతికి వచ్చే వరకు పెట్టుబడులు భారం అవుతున్నాయి. ఏటా పెరుగుతున్న ఖర్చులతో అన్నదాతలు అప్పుల పాలవుతున్నారు. కాడెద్దులు కనుమరుగు కాగా, ట్రాక్టర్లు, యంత్రాల వినియోగం పెరిగింది. తాజాగా ఇంధన ధరలు పెరగడంతో డీజిల్‌, పెట్రోల్‌ భారం సైతం వారిపై నేరుగా పడనుంది.

మార్కెటింగ్‌ పెరిగితే..

పంటలకు మద్దతు ధర పెంచినా క్షేత్రస్థాయిలో మార్కెటింగ్‌ సౌకర్యం అందుబాటులోకి వస్తేనే రైతులకు మేలు జరగనుంది. దళారులు అన్నదాతలను దోచుకోకముందే స్థానిక అవసరాలకు అనుగుణంగా సమయానికి కేంద్రాలు తెరుచుకోవాలి. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో తమ పంటను అమ్ముకునే అవగాహన కలిపంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పత్తి, వరిధాన్యం కొనుగోళ్ల సమయంలో తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం కొనుగోళ్లు సరళతరం చేసి, మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.

శుభ పరిణామం

కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర పెంచడం శుభపరిణామం. ఏటా వ్యవసా య సాగు ఖర్చులు పెరుగుతు న్నా రైతులకు మద్దతు ధర లభించడం లేదు. ఎట్టకేలకు ప్రభుత్వం మద్దతు ధరలు పెంచడం రైతులకు ఊరట లభిస్తుంది. – పిప్రె రాజన్న, రైతు,

మోతుగూడ, మం.ఆసిఫాబాద్‌

కేంద్రాలు ఏర్పాటు చేయాలి

ధర పెంపుతో పాటు రైతులకు అనుకూలంగా మండల కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వరి పంటకు స్వల్పంగా క్వింటాల్‌కు రూ.72 పెంచితే పత్తికి రూ. 557 పెంచారు. మిగితా పంటలకు కూడా మద్దతు ధర పత్తి లాగే పెంచాలి.

– కోలె రవీందర్‌,

గుండి, మం.ఆసిఫాబాద్‌

మద్దతు ధరలు(రూ.లలో)

పంట రకం 2025–26 2026–27 పెరిగిన ధర

పత్తి(పొడవు పింజ) 8,110 8,667 557

పత్తి(మధ్య రకంపింజ) 7,710 8,267 557

వరి ఏ గ్రేడ్‌ 2,389 2,461 72

వరి సాధారణం 2,369 2,441 72

దేశీజొన్న 3,749 4,073 324

హైబ్రిడ్‌ జొన్న 3,699 4,023 324

మొక్కజొన్న 2,400 2,410 10

కందులు 8,000 8,450 450

సోయాబిన్‌ 5,328 5,708 380

రాగులు 4,887 5,205 319

సజ్జలు 2,775 2,900 125

పెసలు 8,768 8,780 12

మినుములు 7,800 8,200 400

నువ్వులు 9,936 10,436 500

గడ్డినువ్వులు 9,537 10,052 515

పొద్దుతిరుగుడు 7,721 8,343 622

వేరుశనగ 7,263 7,517 254

పత్తికే పెద్దపీట

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో 14 పంటలకు మద్దతు ధర పెరిగింది. ఇందులో పత్తికే పెద్దపీట వేశారు. పత్తి క్వింటాల్‌కు రూ.557 పెంచారు. దీంతో పొడువు పింజ పత్తి రూ.8,667, మధ్యరకం పింజ క్వింటాల్‌ రూ.8,267కు చేరింది. ఇక మరో ప్రధాన పంట వరికి మాత్రం నామమాత్రంగా రూ.72 మాత్రమే పెంచారు. వరిధాన్యం సాధారణ రకానికి క్వింటాల్‌ రూ.2441, ఏ గ్రేడ్‌ వరిధాన్యం ధర క్వింటాల్‌ రూ.2,461 నిర్ణయించారు. దీంతోపాటు జిల్లాలో అత్యధికంగా సాగు చేసే జొన్న, కందులు, మినుములు, సజ్జలు వంటి పంటలకు ఆశించిన స్థాయిలో పెంచారు.

Advertisement
 
Advertisement
Advertisement