స్పందన అంతంతే..! | - | Sakshi
Sakshi News home page

స్పందన అంతంతే..!

May 16 2026 1:15 AM | Updated on May 16 2026 1:15 AM

● ‘పది’ ఫెయిలైన వారికోసం నాలుగు శిక్షణ కేంద్రాలు ● తరగతులకు సక్రమంగా హాజరుకాని విద్యార్థులు

కాగజ్‌నగర్‌టౌన్‌: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రత్యేక ఉచిత శిక్షణ తరగతులకు ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. విద్యావారోత్సవాల్లో భాగంగా ఈ నెల 11 నుంచి ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. జిల్లాలో 300 మంది విద్యార్థులు అనుత్తీర్ణులు కాగా, వారి కోసం నాలుగు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్నిచోట్లా ఆశించిన స్థాయిలో హాజరు నమోదు కావడం లేదు. ఒక్కో కేంద్రంలో 10 నుంచి 20 మంది మాత్రమే హాజరువుతుండటంతో పాఠశాలలు వెలవెలబోతున్నాయి.

శిక్షణ కేంద్రాలు ఇవే..

జిల్లాలోని విద్యార్థుల కోసం నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్‌ జెడ్పీహెచ్‌ఎస్‌(బాలికలు)లో ఆసిఫాబాద్‌, రెబ్బెన, వాంకిడి మండలాల విద్యార్థులు 79 హాజరు కావాలి. అలాగే కాగజ్‌నగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(ఓల్డ్‌)లో కాగజ్‌నగర్‌, కౌటాల, సిర్పూర్‌(టి) మండలాల విద్యార్థులు 123 మంది, పెంచికల్‌పేట్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో బెజ్జూర్‌, చింతలమానెపల్లి, దహెగాం విద్యార్థులు 66 మంది, సిర్పూర్‌(యు)లో టీజీఎంఎస్‌ మోడల్‌ స్కూల్‌లో సిర్పూర్‌(యు), లింగాపూర్‌, జైనూర్‌ విద్యార్థులు 32 మంది విద్యార్థులు శిక్షణ తరగతులకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంత విద్యార్థులు ఇబ్బంది పడకుండా జూన్‌ 3 వరకు వస్తే రవాణా ఖర్చుల నిమిత్తం రూ.1000 చెల్లించనున్నారు. అలాగే నోట్‌బుక్స్‌, పెన్నులు సైతం ఉచితంగా అందిస్తున్నారు.

అవగాహన లోపమా, నిర్లక్ష్యమా?

పదో తరగతి ఫెయిలైన విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. నిష్ణాతులైన ప్రభుత్వ ఉపాధ్యాయులతో బోధన కొనసాగుతోంది. జూన్‌లో జరిగే సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులకు ఈ తరగతులు ఎంతో ఉపయోగపడతాయి. ఇంటి దగ్గర చదివేందుకు అనువైన పరిస్థితులు లేని ఉపయోగించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. కానీ ఉచిత శిక్షణపై విద్యార్థులకు సమాచారం లేకపోవడం, విద్యార్థుల్లో పరీక్షలపై భయంతో తరగతులకు హాజరుకావడం లేదని తెలుస్తోంది. మరికొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఫెయిలైన విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే తమ పిల్లలను దగ్గరలోని శిక్షణ కేంద్రాల్లో చేర్పించాలని వారు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement