పూర్తిస్థాయిలో అందని పెట్టుబడి సాయం ఇప్పటివరకు రెండెకరాలకే పరిమితం నిరాశలో అన్నదాతలు
ఆసిఫాబాద్‌అర్బన్: వర్షాకాలం ముంచుకొస్తోంది.. ఖరీఫ్ పంటల సాగుకు భూములను రైతులు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే యాసంగి(రబీ) సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందలేదు. యాసంగి పంటల సీజన్ ముగింపు దశకు వచ్చినా నేటికీ వందశాతం నిధులు విడుదల కాలేదు. ప్రస్తుతం కేవలం రెండెకరాల లోపు మాత్రమే పెట్టుబడి సాయం పరిమితం కాగా, మిగిలిన వారి ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ అవుతాయనే విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు.
ఖాతాల్లో రూ.1.31 కోట్లు జమ
జిల్లా వ్యాప్తంగా 1,44,511 మంది రైతులు ఉన్నారు. అందరికీ పెట్టుబడి సాయం అందించడానికి రూ.2.68 కోట్ల నిధులు అవసరం. సాధారణంగా యాసంగికి సంబంధించిన రైతుభరోసా నిధులను డిసెంబర్, జనవరిలోనే విడుదల చేస్తారు. కానీ ఈసారి మార్చి 22న మొదటి విడత విడుదల చేశారు. ఎకరం వరకు భూమికి సంబంధించిన పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. గత నెల 20న రెండో విడతలో రెండెకరాల్లోపు రైతులకు సాయం అందించారు. రెండు విడతల్లో కలిపి జిల్లాలోని 1,34,239 మంది రైతులకు రూ.1.31 కోట్ల నిధులు మాత్రమే జమ అయ్యాయి. మరో రూ.1.37 కోట్లు జమ కావాల్సి ఉంది. మిగతా నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో అనే విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది.
పెట్టుబడికి ఇబ్బంది
పంటల పెట్టుబడి విషయంలో అండగా నిలవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం 2018లో రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేస్తామని చెబుతోంది. గత వానాకాలంలో రైతులందరికీ నిధులు జమ అయ్యాయి. కానీ యాసంగి వచ్చేసరికి పథకం అమలులో జాప్యం జరుగుతోంది. గతంలో పంట పెట్టుబడుల కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేవారు. రైతుబంధు పథకం ప్రారంభమయ్యాక అప్పులు చేయాల్సిన అవసరం కొంతమేర తగ్గింది. పథకం అమలు చేయడంలో రెండేళ్లుగా జాప్యం జరుగుతుండటంతో మళ్లీ అన్నదాతలు అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. యాసంగిలోనే పూర్తిస్థాయి సాయం అందకపోవడంతో ఇక వచ్చే వానాకాలంలో ఏమేరకు ఇస్తారో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


