ఉపాధిహామీ కూలీలకు నిలిచిన పంపిణీ కేవలం ఆన్‌లైన్‌లో వివరాలు నిరక్షరాస్యులకు తప్పని తిప్పలు
తిర్యాణి: రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలకు అండగా నిలిచేందుకు అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో నూతన నిబంధనలు కూలీలకు ఇబ్బందిగా మారుతున్నాయి. గతంలో చేతికందే పే స్లిప్పుల పంపిణీ నిలిచిపోయింది. ఎంత పని చేశా మో, ఖాతాల్లో ఎంత జమ అవుతుందో తెలియడం లేదు. అక్షరాస్యత తక్కువగా ఉన్న ఏజెన్సీ ప్రాంత కూలీలతోపాటు చదువురాని పేదలు దళారుల చేతిలో మోసపోయే ప్రమాదం ఉంది. యాప్‌లపై అవగాహన లేకపోవడం, వివరాలు స్పష్టంగా తెలియకపోవడంతో పడరానిపాట్లు పడుతున్నారు.
జూలై 1 నుంచి వీబీ జీరామ్ జీ
2005 నుంచి అమలవుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ప్రస్తుతం ఒక్కో కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పిస్తున్నారు. జూలై 1 నుంచి దీని స్థానంలో వీబీజీ రామ్‌జీ చట్టాన్ని అమలు చేయనున్నారు. పని దినాల సంఖ్య 125 రోజులకు పెంచనున్నారు. జిల్లావ్యాప్తంగా 1.22 లక్షల జాబ్ కార్డులు ఉండగా, 2.42 లక్షల మంది కూలీలు సభ్యత్వం కలిగి ఉన్నారు. ఇందులో 84 వేల యాక్టీవ్ జాబ్‌కార్డులు ఉండగా, 1.53 లక్షల మంది యాక్టీవ్ కూలీలు ఉన్నారు.
నిలిచిన పే స్లిప్‌లు
జిల్లాలో ఉపాధిహామీ పథకంలో భాగంగా పనులు చేపడుతున్న కూలీలకు వేతన స్లిప్పులు ఇవ్వడం లేదు. నాలుగేళ్ల క్రితం వరకు సక్రమంగా అందజేసినా ప్రస్తుతం వివిధ కారణాలను సాకుగా చూపిస్తూ పంపిణీ నిలిపివేశారు. పే స్లిప్‌లో కూలీ పేరు, పని ప్రదేశం, ఎన్ని రోజులు పని చేశారు.. రోజువారీ వేతనం ఎంత మొత్తం వచ్చింది అనే వివరాలతోపాటు వంద రోజులు నిండడానికి ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయి అనే సమాచారం పూర్తిగా ఉంటుంది. తద్వారా కూలీలకు ఏ పని ప్రదేశంలో ఎన్ని రోజులు పని చేశారో, ఎంత వేతనం వస్తుందో స్పష్టంగా తెలిసేది. ప్రస్తుతం స్లిప్‌ల పంపిణీ కాకపోవడంతో వారానికి ఎంత వేతనం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతీ వారం వేతన వివరాలు తెలిస్తే ఒక వారం తక్కువ డబ్బులు పడినా తదుపరి వారం గరిష్ట వేతనం కోసం పని చేసేందుకు కూలీలు ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది.
కూలీలు నష్టపోయే అవకాశం..!
సాధారణంగా ఉపాధిహామీ పథకం పనులకు సంబంధించిన నిధులను పోస్టాఫీసు లేదా బ్యాంక్ ఖాతాల ద్వారా చెల్లిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికీ సగానికి పైగా పోస్టాఫీసు ఖాతాల్లోనే డబ్బులు జమవుతున్నాయి. కూలీలకు ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ వారాల పేమెంట్‌లు జమ చేస్తుంటారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన కూలీలు అధికంగా ఉండటంతో తమ ఖాతాల్లో ఎంత నగదు జమ అయిందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలో బీపీఎంలు నగదు విత్‌డ్రా సమయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయినా సమీపంలో ఏటీఎం కేంద్రాలు అందుబాటులో లేవు. దీంతో మినీ ఏటీఎం నిర్వాహకులను ఆశ్రయించాల్సిందే. ఆ సమయంలోనూ అక్రమాలు జరిగే అవకాశం లేకపోలేదు. కూలీల వేతన వివరాలను జన్ మన్ రేగా అనే యాప్‌లో పొందుపరుస్తున్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో కూలీలకు దానిపై అవగాహన లేకపోవడంతో ఉపయోగపడటం లేదు.


