ఆసిఫాబాద్: జిల్లాలో అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటుతుండటంతో దాదాపు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సమాచారం లేకుండా కరెంట్ కట్ చేస్తున్నారు. అర్ధరాత్రి వేళల్లో గంటల తరబడి అంతరాయం ఉంటుండడంతో రాత్రిళ్లు నిద్రలేక ఉక్కపోతతో జనం అవస్థలు పడుతున్నారు. రెండు రోజులుగా ఏకంగా జిల్లా కేంద్రంలోనే అర్ధరాత్రి గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, కౌటాలలో 132/33 కేవీ సబ్ స్టేషన్లు ఉండగా, 33/11 కేవీ సబ్ స్టేషన్లు వివిధ ప్రాంతాల్లో 34 వరకు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 1,77,479 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 1,41,942 గృహ, 15,004 వాణిజ్య, 633 పరిశ్రమలు, 15,258 వ్యవసాయ కనెక్షన్లతోపాటు వివిధ రకాల కనెక్షన్లు ఉన్నాయి. ప్రతిరోజూ సుమారు 17 లక్షల యూనిట్లు వినియోగిస్తుండగా, ప్రభుత్వానికి రూ.కోటి ఆదాయం సమకూరుతోంది.
పెరిగిన వినియోగం
ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగిస్తున్నారు. అలాగే ప్రతీ ఇంట్లో విద్యుత్ గృహోపకరణాల వాడకం పెరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో మామూలు రోజులతో పోలిస్తే ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ 30 శాతం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. గ్రిడ్‌పైనా ఒత్తిడి పడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో లోఓల్టేజీ సమస్యతో తరచూ ఉపకరణాలు కాలిపోతున్నాయి. అన్ని మండలాలకు సబ్‌స్టేషన్లు లేకపోవడంతో పక్క మండలం సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా జరుగుతుంది. ఈ క్రమంలో ఈదురు గాలులు వీస్తే ముందస్తుగానే కరెంట్ కట్ చేస్తున్నారు.
విద్యుత్ కోతలు లేవు
జిల్లాలో ఎలాంటి విద్యుత్ కోతలు లేవు. కేవలం వర్షం, ఈదురుగాలులు వచ్చినప్పుడు మాత్రమే ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నాం. 160 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు గతంలో నాలుగు ఉండగా, ప్రస్తుతం 16కు పెంచాం. కేవలం మెయింటెనెన్స్ ఉన్నపుడు మాత్రమే విద్యుత్ కట్ చేస్తున్నాం.
చిరువ్యాపారుల నష్టం
తరచూ విద్యుత్ అంతరాయంతో వెల్డింగ్, జిరాక్స్, చిన్న పరిశ్రమలు.. ఇతర చిరువ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జనరేటర్ సౌకర్యం కూడా లేదు. విద్యుత్ అంతరాయం ఏర్పడితే రోగులకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ జనరేటర్లు లేవు. చాలాచోట్ల సోలార్, ఇన్వర్టర్లతో కాలం వెల్లదీస్తున్నారు. సంబంధిత అధికారులు విద్యుత్ కోతలు లేకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ప్రజలు కోరుతున్నారు.


