కెరమెరి: వేసవిలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా అన్ని గ్రామాలకు శుద్ధజలం అందించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. మండలంలోని ధనోరా మిషన్ భగీరథ పంప్ హౌస్‌ను గురువారం సందర్శించారు. పంప్‌హౌస్ నుంచి ఎన్ని మండలాలకు నీటి సరఫరా అవుతుందని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మోటర్లు, పైప్‌లైన్ల మరమ్మతులు ఉంటే తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. అనంతరం మండలంలోని కొఠారి కొలాంగూడలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను గృహ నిర్మాణ శాఖ పీడీ టీఎన్ ప్రకాశ్‌రావుతో కలిసి పరిశీలించారు. 110 ఇళ్లు మంజూరు కాగా, 108 ఇళ్ల ప్రారంభించారని, ఏడు పూర్తయ్యాయని తెలిపారు. 86 ఇళ్లు స్లాబ్ వేసేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సతీశ్‌కుమార్, సర్పంచ్ మడావి శాంతాబాయి తదితరులు పాల్గొన్నారు.
లక్కీడ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక
ఆసిఫాబాద్‌రూరల్: 2026– 27 విద్యా సంవత్సరంలో బెస్ట్ అవైలబుల్ పథకం కింద 3, 5, 8వ తరగతుల్లో విద్యార్థుల ఎంపిక కోసం గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో డీటీడీవో రమాదేవితో కలిసి కలెక్టర్ హరిత లక్కీడ్రా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 56 సీట్లల్లో పీవీటీజీ విద్యార్థులకు ఐదు సీట్లు కేటాయించగా, మిగితా 46 సీట్లను లక్కీడ్రా ద్వారా భర్తీ చేశామన్నారు. మూడో తరగతలో 29 మంది, ఐదో తరగతిలో 14 మంది, ఎనిమిదో తరగతిలో 13 మంది విద్యార్థులను ఎంపిక చేశామని తెలిపారు. కార్యక్రమంలో జీసీడీవో శకుంతల, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఓటరు సవరణకు ఏర్పాట్లు
ఆసిఫాబాద్: జిల్లాలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు కలెక్టర్ కె.హరిత అన్నారు. గురువారం న్యూఢిల్లీలోని చీఫ్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుంచి ముఖ్య ఎన్నికల అధికారి జ్ఞానేశ్వర్ కుమార్ ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణపై వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు హాజరయ్యారు. ముఖ్య ఎన్నికల అధికారి ఓటరు ప్రత్యేక సవరణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణకు అధికారులు, సూపర్‌వైజర్లను నియమించి, శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఈ నెలాఖరులోగా ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.


