భాషపై పట్టేది..? | - | Sakshi
Sakshi News home page

భాషపై పట్టేది..?

May 1 2026 6:15 AM | Updated on May 1 2026 6:15 AM

తెలుగు, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల్లో ఎక్కువ మంది ఫెయిల్‌.. ‘పది’ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల వింత పరిస్థితి మాతృభాష మరాఠీ, గోండి కావడమే కారణమా..? మండలాల్లో మెరుగుపడిన ఉత్తీర్ణత

ఆసిఫాబాద్‌రూరల్‌: పదో తరగతి విద్యార్థుల్లో ఎక్కువ మంది తెలుగు, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల్లో ఫెయిల్‌ కావడం ఆందోళనకరంగా మారింది. కఠినమైన గణితం, సైన్స్‌లో కాకుండా భాష సబ్జెక్టుల్లో తప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. జిల్లావ్యాప్తంగా 170 ఉన్నత పాఠశాలల నుంచి 6,932 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరైతే ఇందులో 6,527 మంది ఉత్తీర్ణత సాధించారు. 405 మంది ఫెయిల్‌ అయ్యారు. అత్యధికంగా తెలుగు సబ్జెక్టులో 190 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేదు. సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తే తెలుగు తర్వాత ఇంగ్లిష్‌లో 186 మంది, గణితంలో 141 మంది, సైన్స్‌లో 128 మంది, హిందీ, సాంఘిక శాస్త్రంలో 30 మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. జిల్లాలో చాలామంది మరాఠీ, గోండి మాట్లాడే విద్యార్థులు ఉన్నారు. దీంతో వారు తెలుగు, ఇంగ్లిష్‌ లాంగ్వేజీలపై పట్టు సాధించలేకపోయారని అధికారులు చెబుతున్నారు.

శతశాతం 2.0 అమలు

భాష సబ్జెక్టుల్లో విద్యార్థులు కొంతమంది తప్పినా.. జిల్లా మాత్రం గతేడాదితో పోల్చితే మెరుగైన ఉత్తీర్ణ త శాతం నమోదు చేసింది. మూడేళ్లుగా చివరి మూ డుస్థానాలకే పరిమితం కాగా, 2025–26 ఫలితాల్లో మాత్రం నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 28వ స్థానంలో నిలిచింది. పదో తరగతిలో ఉత్తీర్ణత శా తం పెంచాలనే సంకల్పంతో జిల్లా విద్యాశాఖ శతశాతం 2.0 కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసింది. గిరిజన జిల్లాలో మెరుగైన ఫలితాలు రావా లని అదనపు కలెక్టర్‌ పాఠశాలలను నిరంతరం పర్యవేక్షించారు. వారంలో ఒకరోజు హెచ్‌ఎంలు, ఎంఈవోలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేశారు. డిసెంబర్‌లోగా సిలబస్‌ పూర్తి చేయించారు. దీంతో ముందుగానే రివిజ న్‌ మొదలు పెట్టేందుకు అవకాశం కలిగింది. ఉద యం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ.. రోజువారీగా సైక్లింగ్‌ టెస్ట్‌లు ఏర్పాటు చేశా రు. విద్యార్థుల హాజరు, సబ్జెక్టుల వారీగా రిపోర్టులు స్వయంగా పరిశీలిస్తూ వెనుకబడిన వారిపై ప్ర త్యేక దృష్టి సారించారు. మరోవైపు సింగరేణి యాజ మాన్యం సహకారంతో ప్రత్యేక తరగతులకు హాజర య్యే వారికి ఉదయం, సాయంత్రం స్నాక్స్‌ అందించారు. సబ్జెక్టుల వారీగా ప్రత్యేక మాడ్యూల్‌ తయా రు చేయించి ఉపాధ్యాయులకు అందించారు.

మెరుగైన ఉత్తీర్ణత

జిల్లాలోని మొత్తం 170 ఉన్నత పాఠశాలలకు 54 పాఠశాలలు శతశాతం ఉత్తీర్ణత సాధించాయి. 13 ఆశ్రమాలు, మూడు బీసీ సంక్షేమ గురుకులాలు, 8 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, 9 కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, ఒక మైనార్టీ పాఠశాల, రెండు సాంఘిక సంక్షేమ గురుకులాలు, 18 ప్రైవేట్‌ పాఠశాలలు, 3 గిరిజన సంక్షేమ గురుకులాలు 100 శాతం ఉత్తీర్ణతతో మెరిశాయి. కెరమెరి మండలంలో 338 మంది పరీక్షలకు హాజరైతే కేవలం ముగ్గురు మాత్రమే పాస్‌ కాలేదు. లింగాపూర్‌ మండలంలో ఇద్దరు, పెంచికల్‌పేట్‌, సిర్పూర్‌(యు)లో ఆరుగురు చొప్పున, తిర్యాణిలో నలుగురు మాత్రమే ఫెయిల్‌ అయ్యారు. గరిష్టంగా కాగజ్‌నగర్‌ మండలంలో 104 మంది ఉత్తీర్ణత సాధించలేదు. ఆసిఫాబాద్‌లో 66 మంది, బెజ్జూర్‌లో 23, చింతలమానెపల్లి 39, దహెగాం 12, జైనూర్‌ 33, కౌటాల 24, రెబ్బెన 21, సిర్పూర్‌(టి) 41, వాంకిడి మండలంలో 21 మంది ఫెయిల్‌ అయ్యారు.

ఉత్తీర్ణత పెంచేందుకు చర్యలు

గతేడాది కంటే ఈసారి కాస్త మెరుగైన ఫలితాలు సాధించాం. నేను జిల్లా విద్యాధికారిగా విధుల్లోకి వచ్చే సమయానికే వార్షిక పరీక్షలు మొదలయ్యాయి. తక్కువ ఉత్తీర్ణత శాతం సాధించిన మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్తీర్ణత పెంచేందుకు చర్యలు చేపడతాం.

– లలిత, డీఈవో

Advertisement
 
Advertisement
Advertisement