ఆసిఫాబాద్: అనాథ పిల్లలను గుర్తిస్తే వెంటనే జిల్లా బాలల సంరక్షణ విభాగానికి సమాచా రం అందించాలని ఆర్టీసీ డీఎం రాజశేఖర్ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులకు పిల్లల దత్తత ప్రక్రియ, బాలల హక్కులపై అవగాహన కల్పించారు. డీఎం మాట్లాడుతూ కొంతమంది నవజాత శిశువులు, చిన్నారులను వదిలివేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, అలాంటి పిల్లలను గుర్తిస్తే పోలీసులు, ప్రభుత్వ బాలల సంరక్షణ అధికారికి 1098 ద్వారా సమాచారం అందించాలని కోరారు. పిల్లలను దత్తత తీసుకునే వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన చట్టబద్ధమైన విధానాలు పాటించాలని సూచించారు. అనంతరం పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీవోఎన్‌ఐసీ శ్రావణ్‌కుమార్, కౌన్సిలర్ చంద్రశేఖర్, చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది వెంకటేశ్వర్లు, సుకన్య పాల్గొన్నారు.


