ఆసిఫాబాద్‌అర్బన్: జనాభా గణన– 2027లో భాగంగా మే 10 వరకు స్వీయ గణన ద్వారా వివరాలు నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం స్వీయ గణన, ఉపాధిహామీ పథకం, నకిలీ విత్తనాలు, మందులు, ఇంధన కొరత, యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మన జనగణన– మన అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనాభా గణన 2027లో మొదటి విడతగా మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యుమరేటర్లు ప్రతీ ఇంటిని సందర్శించి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారని తెలిపారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వీయ గణన ద్వారా తమ ఇంటి వివరాలు, 33 అంశాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో 994 మంది ఎన్యుమరేటర్లు, 174 మంది సూపర్‌వైజర్లు, 1,689 హౌజ్ లిస్టింగ్ బ్లాక్‌లుగా గుర్తించినట్లు పేర్కొన్నారు.
ఇంధన కొరత లేదు
జిల్లాలో ఇంధన కొరత లేదని కలెక్టర్ తెలిపారు. డి మాండ్‌కు సరిపడా పెట్రోల్, డీజిల్ సరఫరా ఉంద ని పేర్కొన్నారు. అనవసరమైన వదంతులు నమ్మొద్దన్నారు. ఉపాధిహామీ పనిప్రదేశాల్లో కూలీలకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. రానున్న వానాకాలం సీజన్ దృష్ట్యా రైతులు నకిలీ పత్తి విత్తనాలు, మందులు కొనుగోలు చేయొద్దని సూచించారు. అనుమతి లేకుండా విత్తనాలు, మందులు కొనుగోలు చేసినా, విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల కోసం 34 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి వాసుదేవరెడ్డి, వ్యవసా య శాఖ అధికారి వెంకటి, డీపీఆర్‌వో సంపత్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.


