ఆసిఫాబాద్: జిల్లాలో విద్య, వైద్యం, తాగునీటితోపాటు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తానని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో గురువారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటాల్లోనే..
తండ్రి సీతారాం జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి, తల్లి కమల గృహిణి. సోదరుడు బ్యాంకు ఉద్యోగి. మా స్వగ్రామం రాజస్తాన్‌లోని సవాయి మాధోపూర్. ప్రాథమిక విద్య సొంతూరులోని ప్రభుత్వ పాఠశాలలో పూర్తిచేశా. జైపూర్‌లో ఇంటర్, వారణాసి ఐఐటీలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తయ్యింది. అనంతరం 2013– 14లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగం వచ్చింది. అనంతరం సివిల్స్‌కు ఎంపికయ్యా. 2022 ఐఏఎస్ బ్యాచ్. భార్య మౌనిక ఐపీఎస్ ఆదిలాబాద్ అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు.
పీవోగా పనిచేసిన అనుభవం
గతంలో ఆదిలాబాద్ జిల్లా సబ్‌కలెక్టర్‌గా విధులు నిర్వహించా. ఉట్నూర్ ఐటీడీఏ ఇన్‌చార్జి ఇన్‌చార్జి ప్రాజెక్టు అధికారిగా పనిచేసిన అనుభవం ఉంది. జిల్లాలోని మారుమూల గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారిస్తా. ఏఐ టెక్నాలజీతో ఆస్పిరేషన్ జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేయడంతో పాటు మోడల్ జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకుంటా. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడమే లక్ష్యం. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది.


