బోథ్: మండల కేంద్రంలోని లాల్‌పిచ్ మైదానం సమీపంలో సాగుచేసిన 13 ఎకరాల జొన్నపంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. గురువారం సాయంత్రం పంటచేలలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సింగం వెంకటరమణకు చెందిన ఎనిమిది ఎకరాలు, గోవింద్‌కు చెందిన రెండెకరాలు, మాధవ్‌కు చెందిన మూడెకరాల్లో పంట పూర్తిగా కాలిపోయింది. గమనించిన స్థానికులు ఇచ్చోడలోని ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. సింగం వెంకటరమణకు రూ.4 లక్షలు, గోవింద్‌కు రూ.1.50 లక్షలు, మాధవ్‌కు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోయారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
మెడిగూడలో (ఆర్)లో..
సాత్నాల: మండలంలోని మెడిగూడ (ఆర్)లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జొన్నపంట దగ్ధమైంది. గ్రామానికి చెందిన చిట్యాల రాములు రెండెకరాల్లో సాగు చేసిన జొన్నపంటను కోసి పంటచేలోనే ఉంచాడు. గురువారం పంటచేల పైనుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు ఒకదానికి ఒకటి తాకి నిప్పులు ఎగిసి పడడంతో పంటకు నిప్పంటుకుని క్షణాల్లో మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానిక రైతులు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాకపోవడంతో జొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. దాదాపు రూ.1,50,000 నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు.
కుంటాలలో..
లోకేశ్వరం(కుంటాల): కుంటాల మండలంలోని కల్లూర్‌లో 11 కేవీ విద్యుత్ తీగలు గాలికి ఒకదానికి ఒకటి తాకడంతో నిప్పురవ్వలు ఎగిసిపడి గ్రామానికి జొన్నపంట దగ్ధమైంది. అందకూర్‌కు చెందిన వెంకట్ వారం రోజుల క్రితం జొన్నచేను కోసి పంటను కల్లూర్‌లోని సాయిరాం చేనులో ఆరబెట్టాడు. 11 కేవీ విద్యుత్ తీగలు ఒకదానికి ఒకటి తాకడంతో నిప్పురవ్వలు ఎగిసిపడి మంటలు చెలరేగాయి. జొన్నపంటతో పాటు రైతులు సాయిరాం, బలిరాంకు చెందిన వ్యవసాయ పరికరాలు దగ్ధమయ్యాయి. జొన్న పంట విలువ రూ.20 వేలు, పరికరాల విలువ రూ.10 వేలు ఉంటుందన్నారు.


