ఉట్నూర్‌రూరల్: కాలం కాఠినంగా మారింది. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన ఆ శిశువును కళ్లు తెరవకుండానే అనాథను చేసింది. ఉట్నూర్ మండలం రాంజీగోండ్‌కు చెందిన గిరిజన మహిళ ఆత్రం గంగుబాయి ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసింది. నాలుగు నెలల క్రితం భర్త విఠల్‌కూడా మృతి చెందాడు. తాజాగా తల్లి మృతితో మూడేళ్ల బాలుడు, పుట్టిన శిశువు అనాథలయ్యారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్పందించారు. గురువారం బాధిత నివాసానికి చేరుకుని చిన్నారుల నానమ్మను ఓదార్చారు. ‘మీరు అనాథలు కాదు, నా పిల్లలు’ అని మాటిచ్చి, పసి బాలుడిని తమ చేతుల్లోకి తీసుకున్నారు.
ఆవిర్భావ్ నామకరణం
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భార్య దృపదతో కలిసి పసి బాలుడికి ‘ఆవిర్భావ్’ అని నామకరణం చేశారు. పెరిగి పెద్దయ్యే వరకు పోషణ, పాలు, ఖర్చులు తాను భరిస్తానని ప్రకటించారు. ప్రభుత్వం తరపున రూ.1,90,000 చెక్కు అందజేశారు. సొంత పిల్లల్లా భావించి బాధ్యతలు చేపట్టిన ఈ దంపతుల చర్య స్థానికుల్లో సంతోషాన్ని రేకెత్తించింది. ఆవిర్భావ్ జీవితంలో కొత్త వెలుగు పుట్టాలనే ఆశతో పేరు పెట్టారు. ఈ మానవత్వం సమాజానికి ప్రేరణగా నిలిచింది.


