700 నుంచి 800 మంది జనాభాకు ఒక బ్లాక్‌ | - | Sakshi
Sakshi News home page

700 నుంచి 800 మంది జనాభాకు ఒక బ్లాక్‌

Apr 1 2026 7:48 AM | Updated on Apr 1 2026 7:48 AM

నేటి నుంచి జిల్లాలో గృహాల లెక్కింపు గడపగడపకూ వెళ్లనున్న ఎన్యుమరేటర్లు 34 ప్రశ్నలతో వివరాల సేకరణ డిజిటల్‌ పద్ధతిలో నమోదు

హాజరైన సిబ్బంది

ఆసిఫాబాద్‌: జిల్లాలో బుధవారం నుంచి జనగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రతీ గణన వివరాలు కాగితం రూపంలోనే ఉండగా, తొలిసారి మొబైల్‌ అప్లికేషన్‌లో వివరాలు అప్‌లోడ్‌ చేయనున్నారు. మొత్తం ప్రక్రియ డిజిటల్‌గా చేపట్టనున్నారు. 2027 జనగణన రెండు దశల్లో చేయనుండగా, మొదటి దశలో గృహాల జాబితా, రెండోదశలో జనాభా, వ్యక్తిగత వివరాలు సేకరించనున్నారు. ఎన్యుమరేటర్లు గడపగడపకూ వెళ్లి ఇళ్ల జాబితా తయారు చేస్తారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయి సిబ్బందికి కార్యాచరణ, శిక్షణపై దిశానిర్దేశం చేశారు. కలెక్టర్‌ హరిత జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించి స్థానిక అధికారులకు అవగాహన కల్పించారు. జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులకు శిక్షణ పూర్తిచేశారు. ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు మూడు రోజులుగా జిల్లా కేంద్రంలో శిక్షణ కొనసాగుతుండగా బుధవారం పూర్తికానుంది. ఇప్పటికే 20 మంది మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారు. తొలుత ఒక రెవెన్యూ గ్రామాన్ని యూనిట్‌గా ఎంపిక చేసుకుని సర్వే ప్రారంభి స్తారు. రెండో దశ టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ ట్రైనర్లకు శిక్షణ పూర్తి కాగా, మూడో దశలో 21 మంది ఫీల్డ్‌ ట్రైనర్లకు ప్రస్తుతం శిక్షణ కొనసాగుతోంది.

జిల్లాలో జనగణన– 2027లో భాగంగా బుధవారం నుంచి మొదటి విడత ఇళ్ల గణన పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర కె.హరిత అన్నా రు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి చార్ట్‌ అధికారులు, ఫీల్డ్‌ అధికారులు, సాంకేతిక సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. జనాభా గణనలో భాగంగా చా ర్ట్‌ అధికారులుగా వ్యవహరిస్తున్న తహసీ ల్దార్లు, ఎంపీడీవోలకు తమ పరిధిలోని ప్రతీ అంశంపై అవగాహన ఉండాలన్నారు. రెవె న్యూ గ్రామాలు, పంచాయతీలను క్షేత్రస్థాయిలో సందర్శించి, క్షేత్ర సహాయకులతో హౌజ్‌ లిస్ట్‌ బ్లాక్‌లను రూపొందించాలని ఆదేశించా రు. ప్రతీ ఎన్యుమరేటర్‌కు 700 నుంచి 800 జనాభా వచ్చేలా బ్లాక్‌లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని 335 పంచాయతీలు, 2 ము న్సిపాలిటీల్లో ఇళ్ల గణన పూర్తి చేసి, వారం రో జుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

సర్వే ఇలా..

పదేళ్లకోసారి జరిగే జనగణనలో మొదట హౌజ్‌ మ్యాపింగ్‌ ద్వారా గుర్తించిన ఇళ్లను లెక్కిస్తారు. ఈ దశలో ఎన్యుమరేటర్లు టాబ్లెట్‌లతో ఇల్లు వివరాలు, చిరునామాలు డిజిటలైజ్‌ చేయనున్నారు. హౌజ్‌ మ్యాపింగ్‌లో ఇల్లు నిర్మాణం, వాడే వస్తువుల నుంచి తినే తిండి వరకు పూర్తి వివరాలు సేకరించనున్నారు. తొలిదశలో ఇళ్ల గణన కోసం 34 ప్రశ్నలు అడుగుతారు. ఇంటి పరిస్థితి, కుటుంబ సభ్యుల వివరాలు, వసతుల వివరాలు సేకరిస్తారు. ఇంటి నంబర్‌, యాజమాన్య స్థితి, కుటుంబంలో నివసిస్తున్న వివాహిత జంటల సంఖ్య, గదుల సంఖ్య, యజమాని పేరు, ఏ సామాజిక వర్గానికి చెందిన వారు అనే సమాచారం సేకరిస్తారు. ఇంట్లో తాగునీరు, నీటి లభ్యత, విద్యుత్‌, మరుగుదొడ్డి రకం, డ్రెయినేజీ వ్యవస్థపై వివరాలు తీసుకుంటారు. అలాగే వంటకు వాడుతున్న ఇంధనం, వంటగది సౌకర్యం ఉందా.. డిజిటల్‌ ఆస్తులు రేడియో, టీవీ, ఇంటర్నెట్‌ సౌకర్యం, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌, మొబైల్‌, స్మార్ట్‌ ఫోన్‌ వివరాలు, సైకిల్‌, స్కూటర్‌, కారు, వ్యాన్‌, ప్రధానంగా వినియోగించే తృణధాన్యాల వివరాలు సేకరిస్తారు. ఆధార్‌ను మొబైల్‌ ఓటీపీతో ధ్రువీకరిస్తారు.

జిల్లాలోని 15 మండలాల పరిధిలో 434 రెవెన్యూ గ్రామాలు, 335 గ్రామ పంచాయతీలు, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. 2011 గణాంకాల ప్రకారం జిల్లాలో 5.93 లక్షల జనాభా, 1.20 లక్షల గృహాలు ఉన్నాయి. జనగణనలో ప్రస్తుత ఇళ్ల సంఖ్య తేలనుంది. తహసీల్దార్లు, ఎంపీడీవోలను చార్ట్‌ అధికారులుగా నియమించారు. 171 మంది సూపర్‌వైజర్లు, 995 ఎన్యుమరేటర్లు విధుల్లో ఉంటారు. 700 నుంచి 800 మంది జనాభాను ఒక బ్లాక్‌గా గుర్తించి ఎన్యుమరేటర్‌కు లెక్కించే బాధ్యత అప్పగిస్తారు. ప్రతీ ఆరుగురు సర్వేయర్లకు ఒక సూపర్‌వైజర్‌ ఉంటాడు. అత్యవసర పరిస్థితుల కోసం పదిశాతం అదనపు సిబ్బందిని నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement