కెరమెరి: నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉల్లాస్(అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ ది సొసైటీ) కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ‘అమ్మకు అక్షరమాల’ పేరిట విద్యాబోధన చేపట్టింది. ఐదు నెలలుగా శిక్షణ పొందిన మహిళా సంఘాల సభ్యులు ఆదివారం జిల్లావ్యాప్తంగా తుది పరీక్ష రాయనున్నారు. డీఆర్‌డీఏ, మహిళా సంఘాల సభ్యులకు అక్షరాలు నేర్పించేందుకు గతేడాది అక్టోబర్ 26 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. నూతన విద్యా విధానం– 2020లో భాగంగా గతంలో ఉన్న సాక్షరత భారత్ స్థానంలో ఉల్లాస్‌ను అమల్లోకి తెచ్చారు. స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలకు చదవడం, రాయడం నేర్పించడం దీని ముఖ్య ఉద్దేశం.
మూడు గంటలపాటు పరీక్ష
జిల్లాలోని 15 మండలాల్లో ఆదివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎప్పుడైనా మూడు గంటల పాటు పరీక్ష రాసుకునే వెసులుబాటు కల్పించారు. జిల్లావ్యాప్తంగా 335 గ్రామ పంచాయతీల్లోని పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలల్లో 345 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 11,903 మంది నిరక్షరాస్య మహిళలు పరీక్షకు హాజరుకానున్నారు. అక్షరాస్యతలో చివరి స్థానంలో ఉన్న జిల్లాలో నిరక్షరాస్యులకు చదవడం, రాయడం, అక్షరాలను గుర్తించేలా చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశం. ఇప్పటికే జిల్లా నుంచి మండలాలకు ప్రశ్నపత్రాలు, పెన్నులు చేరడంతో శనివారం సీసీలు ఆయా గ్రామ పంచాయతీలకు పరీక్ష సామగ్రిని చేరవేశారు.
ఇన్విజిలేటర్లుగా వీవోఏలు, సీసీలు
జిల్లావ్యాప్తంగా నిర్వహించే ఉల్లాస్ పరీక్షలకు మండల సమాఖ్యల్లో విధులు నిర్వహిస్తున్న వీవోఏలు, సీసీలతోపాటు కొన్నిచోట్ల అంగన్‌వాడీ కార్యకర్తలు ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వహించనున్నారు. అయితే గతంలో పది మంది సభ్యులకు అక్షరాలు దిద్దించేందుకు ఒక వలంటీర్‌ను నియమించారు. వారికి ప్రత్యేక శిక్షణ కూడా కల్పించారు. రంగురంగుల బొమ్మలు, అందమైన అక్షరాలతో ముద్రించిన పుస్తకాలు అందించారు. రోజులో రెండు గంటల చొప్పున మొత్తం 200 గంటలు బోధించారు. తరగతుల నిర్వహణకు ఆయా గ్రామాల్లోని పాఠశాలలు, ప్రభుత్వ కమ్యూనిటీ భవనాలు, అంగన్‌వాడీ సెంటర్లను వినియోగించుకున్నారు. డిజిటల్ కంటెంట్‌తో కూడిన కంప్యూటర్లు, టీవీలను కూడా కొన్నిచోట్ల సమకూర్చారు. గ్రామైక్య సంఘంలోని మహిళలు ఐదు నెలలుగా నేర్చుకుంటున్న అంశాలను ఈ పరీక్ష ద్వారా పరీక్షించనున్నారు.
తప్పనిసరిగా హాజరు కావాలి
అక్టోబర్ 26 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అక్షరాలు చదవడం, రాయడం, గుర్తించడం ఎంతవరకు వస్తుందనే విషయాలను తెలుసుకునేందుకు ఆదివారం నిర్వహించే పరీక్షతో తేలనుంది. ప్రతిఒక్కరూ హాజరై తమ ప్రతిభ చాటుకోవాలి. 15 మండలాల్లో 11,903 మంది నిరక్షరాస్య మహిళలు రాయనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎప్పుడైనా మూడు గంటలు పరీక్ష రాయవచ్చు.
– మద్రి శ్రీనివాస్, ఉల్లాస్ ప్రోగ్రాం ప్రాజెక్టు అధికారి


